ఈ ఏడాది కొత్తగా షావోమి 6 స్మార్ట్‌ఫోన్లు

Xiaomi Plans To Launch 6 New Phones In India This Year - Sakshi

దేశీయ మార్కెట్లో చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రొడక్ట్‌లతో తన సత్తా చాటుకుంటోంది. ఇక షావోమి స్మార్ట్‌ఫోన్లకు భారత్‌లో వస్తున్న స్పందన అంతా ఇంతా కానిది. తాజాగా ఈ ఏడాది షావోమి 6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని షావోమి గ్లోబల్‌ వైస్‌-ప్రెసిడెంట్‌, ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ లైవ్‌మింట్‌లో తెలిపారు. కేవలం ఆరు స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌ మాత్రమే కాక, 100 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను కూడా షావోమి లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్ట్‌ కేటగిరీల విడుదలతో పాటు, సాఫ్ట్‌వేర్‌పై, ఇంటర్నెట్‌ స్టార్టప్‌లపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు చెప్పారు.
 
భారత్‌లో షావోమి పెట్టుబడులు పెంచడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదని, చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా షావోమినే ఉందని తెలిసింది. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ బ్రాండుగా కూడా షావోమి నిలుస్తోంది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసి మరీ షావోమి భారత్‌ మార్కెట్‌లోకి టాప్‌ బ్రాండుగా దూసుకొచ్చేసింది. ఆరేళ్లలో షావోమి టాప్‌ బ్రాండుగా నిలువడం ఇదే తొలిసారి. రెండు స్వచ్ఛంద రీసెర్చ్‌ సంస్థలు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో మార్చి 14న లాంచ్‌ చేయబోతుంది. రెడ్‌మి 4కు సక్సెసర్‌గా ఇది మార్కెట్‌లోకి వస్తోంది. మోస్ట్‌ అఫర్డబుల్‌ బెజెల్‌-లెస్‌ ఫోన్‌గా ఇది అలరించబోతుంది. 

కేవలం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోనే కాక, ఇటు స్మార్ట్‌టీవీ మార్కెట్‌లోనూ తన పాగా వేయాలని చూస్తోంది. 55 అంగుళాల ఎంఐ టీవీ4 లాంచింగ్ అనంతరం, మరో రెండు అఫర్డబుల్‌ స్మార్ట్‌టీవీలను షావోమి లాంచ్‌ చేసింది. 32 అంగుళాలు, 43 అంగుళాలలో ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్‌టీవీను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగ, 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర 13,999 రూపాయలు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top