మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం!

World faces worst economic fallout since Great Depression - Sakshi

ఐఎంఎఫ్‌ చీఫ్‌ జార్జీవా అంచనా

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్‌ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది.

మన జీవిత కాలంలో గుర్తున్నంత వరకు ఈ స్థాయి ప్రభావాన్ని చూడలేదు’’ అని జార్జీవా పేర్కొన్నారు. వైరస్‌పై పోరాడేందుకు లాక్‌డౌన్‌ అవసరమని, ఇది వందల కోట్ల ప్రజలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ప్రపంచం అసాధారణ అనిశ్చితిని చవిచూస్తోందని, ఈ సంక్షోభం తీవ్రత, ఎంత కాలం కొనసాగేదీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వృద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్‌ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top