ప్రభుత్వం సాయం చేయాలి..లేదంటే మూతే!!

Vodafone Idea will Shut Shop If There Is No Government Relief Says Km Birla - Sakshi

వొడా– ఐడియా బకాయిల భారంపై చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్య

ఎకానమీ మెరుగుపడాలంటే ట్యాక్స్‌ రేట్ల తగ్గింపు సరిపోదు

ఉద్దీపన చర్యలు అవసరమని అభిప్రాయం  

న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్‌– ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. సంస్థను మూసేయాల్సి ఉంటుంది‘  అని శుక్రవారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అయితే, ఎకానమీని గాడిలో పెట్టే దిశగా.. సంక్షోభంలో ఉన్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టెలికం అనేది చాలా కీలక రంగమని ప్రభుత్వం గుర్తించింది.

మొత్తం డిజిటల్‌ ఇండియా కార్యక్రమమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ప్రభుత్వం నుంచి మరింత తోడ్పాటు అవసరం‘ అని ఆయన చెప్పారు. ఏ రకమైన ఊరట చర్యలు కోరుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ప్రధానమైన సమస్య .. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదమే. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. ప్రభుత్వమే టెల్కోలకు వ్యతిరేకంగా ఈ కేసు వేసింది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు‘ అని బిర్లా పేర్కొన్నారు. ఏజీఆర్‌ లెక్కింపు వివాదంలో ఇటీవల కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయీలు కట్టాల్సి రానుంది. దీంతో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడం వల్ల వొడాఫోన్‌ ఐడియా సెపె్టంబర్‌ త్రైమాసికంలో ఏకంగా రూ.50,921 కోట్ల మేర రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే.  

ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలి..
ఎకానమీకి ఊతమిచ్చేందుకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించటం మాత్రమే సరిపోదని, ఆర్థికంగా తోడ్పాటునిచ్చేలా పటిష్టమైన ఉద్దీపన ప్యాకేజీలాంటిది అవసరమని బిర్లా చెప్పారు. ఆ రూపంలో వచ్చే నిధులతో కొన్ని కార్పొరేట్లు రుణభారం తగ్గించుకోగలవని, మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించుకోగలవని ఆయన వివరించారు. ఎకానమీని గట్టెక్కించడానికి ఆదాయ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ.. ‘ఇది కేవలం వినియోగ డిమాండ్‌ పెంచడానికే పరిమితమైన సమస్య కాదు.

ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. ప్రజలు మరింతగా ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు. దీన్నుంచి బైటపడాలంటే.. ఉద్దీపన చర్యలు ప్రకటించడం ఒక్కటే మార్గం. జీఎస్‌టీని 15 శాతానికి తగ్గించారనుకోండి.. అదే పెద్ద ఉద్దీపన చర్య కాగలదు‘ అని బిర్లా చెప్పారు. మరోవైపు ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం కూడా ఎకానమీపై బాగా సానుకూల ప్రభావం చూపగలదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఏకంగా 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో బిర్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top