మెగా టెల్కో ఆవిర్భావం

Vodafone, Idea merger beginning of exciting journey, says KM Birla - Sakshi

వొడాఫోన్‌–ఐడియా

విలీనానికి లైన్‌ క్లియర్‌

తుది అనుమతులిచ్చిన కేంద్రం

ఆగస్టులో డీల్‌ పూర్తయ్యే అవకాశం  

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ల మెగా విలీన ప్రతిపాదనకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. విలీన సంస్థకు మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది. ఇప్పటిదాకా 34.4 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయిర్‌టెల్‌... ఇకపై రెండో స్థానానికి పరిమితం కానుంది. వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు గురువారం తుది అనుమతులిచ్చినట్లు టెలికం శాఖ (డాట్‌) సీనియర్‌ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక సంబంధిత శాఖల నుంచి పొందిన అనుమతులను ఇరు సంస్థలు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ)కి సమర్పించి, విలీన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. టెలికం ట్రిబ్యునల్, ఇతర కోర్టుల ఆదేశాలకు విలీన సంస్థ కట్టుబడి ఉండాలనే షరతులతోనే తుది అనుమతులిచ్చినట్లు స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియ ఆగస్టు ఆఖరికల్లా పూర్తి కాగలదని వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో విటోరియో కొలావో ఇటీవలే పేర్కొన్నారు.  ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న డాట్‌ కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. ఇందులో రూ. 3,926 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్‌ గ్యారంటీల రూపంలో సమర్పించాయి. తమపై విధించిన షరతులను వ్యతిరేకిస్తూనే.. ఈ మొత్తాన్ని చెల్లించినట్లు రెండు సంస్థలు తెలిపాయి.  

విలీన సంస్థ స్వరూపం ఇలా.. 
బ్రిటన్‌ సంస్థ వొడాఫోన్‌కి భారత్‌లో ఉన్న టెలికం కార్యకలాపాలతో ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా సెల్యులార్‌ సంస్థను విలీనం చేయాలన్న ఆలోచన 2017 మార్చిలోనే ఇరు సంస్థలూ ప్రకటించాయి. అనేక ప్రతిబంధకాలన్నీ అధిగమించిన తర్వాత ఈ ఏడాది జూన్‌ కల్లా డీల్‌ ముగియొచ్చని ముందుగా భావించారు. అయితే, జూలై 9కి గానీ డాట్‌ నుంచి అనుమతులు రాలేదు. మొత్తం మీద.. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 4జీ స్పీడ్‌తో మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించడానికి వీలవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా దీనికి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గాను, బాలేశ్‌ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగుతుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్‌హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. నాలుగేళ్ల వ్యవధిలో సమాన వాటాల స్థాయిని సాధించేందుకు వొడాఫోన్‌ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్‌ మరో 9.5 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ రెండు సంస్థల వాటాలు సమాన స్థాయిలో లేని పక్షంలో వొడాఫోన్‌ కొంత వాటాలు విక్రయిస్తుంది. భారీ రుణభారం ఉన్న ఐడియా, వొడాఫోన్‌లు.. టెలికం మార్కెట్లో రిలయన్స్‌ జియో రాకతో పెరిగిన తీవ్ర పోటీని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ డీల్‌ తోడ్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

షేరు 4% అప్‌.. 
విలీన ప్రతిపాదనకు డాట్‌ అనుమతుల నేపథ్యంలో.. గురువారం బీఎస్‌ఈలో ఐడియా సెల్యులార్‌ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 56.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 4.64 శాతం ఎగిసి రూ.57.50 స్థాయిని కూడా తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 4.18 శాతం పెరిగి రూ. 57.20 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 873 కోట్లు పెరిగి రూ. 24,830 కోట్లకు చేరింది. బీఎస్‌ఈలో 1.77 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి.   

కొత్త ప్రయాణానికి శ్రీకారం: కుమార మంగళం బిర్లా 
వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు డాట్‌ నుంచి తుది అనుమతులు వచ్చినట్లు అటు ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. గ్రూప్‌ సంస్థ హిందాల్కో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఐడియా, వొడాఫోన్‌ విలీనంతో.. ఉత్తేజకరమైన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై ఎంతో ఆశావహంగా ఉన్నాం‘ అని ఆయన చెప్పారు. మరికొద్ది వారాల్లో విలీన ప్రక్రియ పూర్తి కాగలదన్నారు. కొత్త సంస్థకు ఇంకా బ్రాండింగ్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కుమార మంగళం బిర్లా వివరించారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top