భారత్‌లో కష్టమే అంటున్న వొడాపోన్‌ ఐడియా

Vodafone Future In India In Doubt After Court Ruling - Sakshi

మరిన్ని పెట్టుబడులు పెట్టేదిలేదు

ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే ఇక అంతే..

వొడాఫోన్‌ యూకే సీఈఓ నిక్‌రీడ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ సీఈవో నిక్‌రీడ్‌ వ్యాఖ్యానించారు. వొడాఫోన్‌– ఐడియా జాయింట్‌ వెంచర్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా రీడ్‌ ఈ విషయాలు చెప్పారు. ‘చాన్నాళ్లుగా భారత్‌ సవాళ్లమయంగా ఉంటోంది. అనుకూలంగా లేని నిబంధనలు, భారీ పన్నులు.. వీటికి తోడు సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు .. ఇవన్నీ కలిసి సంస్థకి ఆర్థికంగా పెనుభారం అవుతున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం చార్జీల కింద భారత్‌లో సుమారు రూ.40 వేల కోట్ల దాకా బకాయిలు వొడాఫోన్‌–ఐడియా కట్టాల్సి రావొచ్చని అంచనా. దీంతో పాటు ఏప్రిల్‌– సెపె్టంబర్‌ మధ్యలో వొడాఫోన్‌ భారత విభాగం నిర్వహణ నష్టాలు 692 మిలియన్‌ యూరోలకు ఎగిశాయి. తాజా పరిణామాలతో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్‌ వెల్లడించింది. 2007లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో వొడాఫోన్‌ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.  

స్పెక్ట్రం వేలంలో పాల్గొనేదెవరు: సీవోఏఐ
5జీ సేవలకు సంబంధించి కావాలనుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని.. కాకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాత టెల్కోలు ఇందులో పాల్గొనకపోవచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ వ్యాఖ్యానించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top