వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

Vodafone And Idea Profits Running Loss - Sakshi

ఆదాయం రూ.11,270 కోట్లు

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కన్సాలిడేటెడ్‌ నష్టాలు జూన్‌ త్రైమాసికంలో రూ.4,874 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో ఈ సంస్థ రూ.4,882 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంటే రూ.8 కోట్ల నష్టాలను తగ్గించుకుంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ రెండూ 2018 ఆగస్ట్‌ 31 నుంచి విలీనమై వొడాఫోన్‌ ఐడియాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలతో ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం ఫలితాలను పోల్చి చూడడం సరికాదు. జూన్‌ క్వార్టర్‌లో ఆదాయం మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.11,775 కోట్ల నుంచి రూ.11,270 కోట్లకు తగ్గింది. కొంత మంది కస్టమర్లను కోల్పోవడం, ఉన్న కస్టమర్లలో కొంత మంది తక్కువ విలువ కలిగిన ప్లాన్లకు మారిపోవడం, సగటు యూజర్‌ నుంచి వచ్చే ఆదాయం తగ్గడం (ఏఆర్‌పీయూ) ప్రభావం చూపించాయి. ‘‘మేము చెప్పిన విధానాన్నే ఆచరణలో అమలు చేస్తున్నాం. దీని తాలూకు ఫలితాలు ఇంకా కనిపించలేదు. మా నెట్‌వర్క్‌ అనుసంధానత, కస్టమర్ల డేటా వినియోగ అనుభవం చాలా ప్రాంతాల్లో మెరుగుపడింది’’ అని వొడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4జీ కవరేజీ విస్తరిస్తామని, డేటా సామర్థ్యాలను కూడా పెంచుకుంటామని చెప్పారు. జూన్‌ త్రైమాసికంలో రూ.2,840 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టామని కంపెనీ తెలిపింది. కంపెనీ యూజర్ల సంఖ్య 33.4 కోట్ల నుంచి 32 కోట్లకు తగ్గడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top