వైద్య సేవల్లోకి విశాక ఇండస్ట్రీస్‌! | visaka Industries entry to Medical service | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లోకి విశాక ఇండస్ట్రీస్‌!

Apr 7 2017 12:47 AM | Updated on Sep 5 2017 8:07 AM

వైద్య సేవల్లోకి విశాక ఇండస్ట్రీస్‌!

వైద్య సేవల్లోకి విశాక ఇండస్ట్రీస్‌!

వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌ వైద్య సేవల్లోకి ప్రవేశిస్తోంది.

సికింద్రాబాద్‌లో రూ.200 కోట్లతో ఆసుపత్రి
ఉత్తరాదిన వి–బోర్డ్స్‌ ప్లాంటు
‘సాక్షి’తో కంపెనీ ఎండీ సరోజ వివేకానంద్‌  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌ వైద్య సేవల్లోకి ప్రవేశిస్తోంది. సికింద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. సంస్థకు ఇక్కడ దాదాపు రెండెకరాల స్థలం ఉందని, దీన్లో రూ.200 కోట్ల దాకా వెచ్చించి ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని విశాక ఎండీ జి.సరోజ వివేకానంద్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. 2019 నాటికి ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వస్తుందన్నారు. ‘‘మేడ్చల్‌లో ఐదెకరాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ) ఏర్పాటు చేస్తున్నాం. విశాక చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తాం. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నాం’’ అని ఆమె వివరించారు.

ఏడాదిలో కొత్త ప్లాంటు..
ప్రస్తుతం విశాక ఇండస్ట్రీస్‌ వి–బోర్డ్స్‌ పేరుతో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డులను భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయిస్తోంది. మిర్యాలగూడ, పుణే వద్ద కంపెనీకి వీటి తయారీ ప్లాంట్లున్నాయి. మిర్యాలగూడ ప్లాంటు సామర్థ్యం నెలకు 4,000 టన్నులు కాగా పుణే ప్లాంటు 7,200 టన్నులు. మరో  ప్లాంటును ఉత్తరాదిన ఏర్పాటు చేస్తామని, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్‌లలో ఒకచోట ఇది ఏర్పాటవుతుందని చెప్పారామె. నెలకు 4–6 వేల టన్నుల సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు రూ.70 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ జి.వంశీ కృష్ణ చెప్పారు. 2018 మార్చిలోగా కొత్త ప్లాంటు రెడీ అవుతుందన్నారు. ఆధునిక భవనాలకు తగ్గట్టుగా విభిన్న డిజైన్లలో వి–బోర్డులను కంపెనీ తయారు చేస్తోంది.

అగ్ర స్థానానికి వి–బోర్డ్స్‌..
నిర్మాణ రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వంశీ కృష్ణ చెప్పారు. ప్లేవుడ్‌ స్థానంలో ఇప్పుడు ఫైబర్‌ సిమెంటు బోర్డులు ఆదరణ పొందుతున్నాయన్నారు. ‘ఫైబర్‌ సిమెంటు బోర్డుల పరిశ్రమ విలువ దేశంలో రూ.500 కోట్లుంది. ప్లేవుడ్‌తో పోలిస్తే వీటి ధర సగానికంటే తక్కువ. నాణ్యత, మన్నిక ఎక్కువ. ఇటుకలకు బదులుగా వీటిని వాడొచ్చు. ఇవి పర్యావరణానికి అనుకూలం కూడా. నిర్మాణ సమయమూ ఆదా అవుతుంది. 2016 డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ ఈ విభాగంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థ టర్నోవరులో 30 శాతం వి–బోర్డుల నుంచి సమకూరుతోంది. రానున్న రోజుల్లో ఈ విభాగమే విశాక ఇండస్ట్రీస్‌కు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టనుంది’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement