వావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు

US Another Step To Protect National Security Integrity Of 5G Networks - Sakshi

వాషింగ్టన్‌: జాతీయ భద్రత, 5 జీ నెట్‌వర్క్‌ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్‌ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి  చేయాలని నిర్ణయించింది. అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆ చర్యలను తామెంతమాత్రం సహించబోమని హెచ్చరించింది ఆ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. (2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు).

ఇక వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అమెరికా అభివర్ణించింది. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించింది. అమెరికాలో వావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వావే నమ్మదగిన వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు గనుక వావే సంస్థ వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. (5జీ టెక్నాలజీతో కొత్త తరం కార్లు)

ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను వావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోతుందని, తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని అమెరికా పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్‌ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్‌ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.(ఎవరెస్ట్‌ పర్వతంపైనా 5జీ సిగ్నల్‌)

కాగా, మొబైల్‌ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ వావేపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో 5 జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశ టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో గతేడాది జూన్‌లో వావే ఒప్పందం కుదుర్చుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top