ఆర్‌బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది

Urjit Patel Comment on RBI Fail in NPAs - Sakshi

బ్యాంకింగ్‌ సమస్యలపై ఉర్జిత్‌ పటేల్‌ వ్యాఖ్యలు  

ప్రభుత్వం, బ్యాంకులు సైతం విఫలమయ్యాయి

ఎల్‌ఐసీ కొనుగోలు చేసిన

ఐడీబీఐ  బ్యాంకు సమస్యాత్మకం

ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్‌బీఐ అయినా ముందుగా స్పందించి ఉండాల్సింది’’ అన్నారాయన. ప్రభుత్వంతో విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్‌ 10న ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొలిసారిగా, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత బ్యాంకింగ్‌ రంగంలో నెలకొన్న ఆందోళనకరమైన అంశాలపై ఉర్జిత్‌ పటేల్‌ మాట్లాడారు. ‘‘ప్రస్తుత మూలధన నిధులు కూడా ఎక్కువ చేసి చూపించినవే. భారీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇవి సరిపోవు. అసలు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చామో తెలుసా? 2014కు ముందు అన్ని పక్షాలూ తమ పాత్రలను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యాయి. బ్యాంకులు, నియంత్రణ సంస్థ (ఆర్‌బీఐ), ప్రభుత్వం కూడా’’ అని ఉర్జిత్‌ పటేల్‌ స్పష్టంచేశారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆర్‌బీఐ గవర్నరు హోదాలో రఘురామ్‌ రాజన్‌ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మదింపు చేయడంతో భారీ స్థాయిలో ఎన్‌పీఏల పుట్ట బయటపడిన విషయం తెలిసిందే. రఘురామ్‌ రాజన్‌ హయాం నుంచి పటేల్‌ ఆర్‌బీఐలో వివిధ హోదాల్లో మొత్తం ఐదేళ్లకు పైగా పనిచేశారు. సమస్యను కార్పెట్‌ కింద చుట్టేయడం ఫలితాన్నివ్వదని, భవిష్యత్తులో రుణ వితరణ సమర్థవంతంగా ఉండాలని పటేల్‌ అభిప్రాయపడ్డారు. 

ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తులను సైతం సమీక్షించాలి  
ఆర్థిక వ్యవస్థతో అంతర్గతంగా అనుసంధానమై ఉన్న దృష్ట్యా ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించడం తప్పనిసరి అని ఉర్జిత్‌ పటేల్‌ ఉద్ఘాటించారు. సామాజిక రంగ అవసరాలు, క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకోలేకపోవడం వంటి అంశాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరిగిందని చెప్పారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల సాయం పెరిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు బలవంతం చేయడంపైనా పటేల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీన బ్యాంకులను విలీనం చేసుకునే బ్యాంకుల విలువ హరించుకుపోతుందన్నారు. ఎల్‌ఐసీతో కొనుగోలు చేయించిన ఐడీబీఐ బ్యాంకును చాలా సమస్యాత్మక బ్యాంకుగా అభివర్ణించారు.   

బ్యాంకులకు అడ్డంకులు తొలగాలి: రఘురామ్‌ రాజన్‌
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కొన్ని అడ్డంకులు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ఈ అడ్డంకులు తొలగితే, ఆయా బ్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వపరమైన నియంత్రణలు కొంత తగ్గాల్సి ఉందని రాజన్‌ అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ వాటాలు ప్రభుత్వానికి ఉన్నంతవరకూ ఇది సాధ్యం కాదనీ అభిప్రాయపడ్డారు.  ప్రైవేటీకరణే అన్నింటికీ మందన్న అభిప్రాయం కొన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ, కేవలం ఇదే సరైనదని భావించకూడదన్నారు. తనకు తెలిసి కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణ కూడా పేలవంగానే ఉందని అన్నారు. తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు ప్రైవేటు రంగంకన్నా ఎక్కువగాను .. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు తక్కువగాను వేతనాలు చెల్లిస్తుండటం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుమతించాల్సిన పరిస్థితులు ఉండటం వంటివి పీఎస్‌బీల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కావాల్సింది ఏమిటి?‘ అన్న ఒక పుస్తకంలో ఈ మేరకు రాజన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తలు అభిజిత్‌ బెనర్జీ, గీతా గోపీనాథ్, మిహిర్‌ ఎస్‌ శర్మ కూడా ఈ పుస్తకంలో తమ విశ్లేషణలు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top