కేంద్ర బడ్జెట్‌ 2019 లైవ్‌ అప్‌డేట్స్‌..

Union Budget 2019 Live Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం. గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్‌ తన మొదటి చిట్టాపద్దులో సంస్కరణలకు పెద్దపీట వేశారు. తన తొలి బడ్జెట్‌లో బ్రాహ్మాండమైన, సంచలనమైన నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. సమీకృత ఆర్థికావృద్ధి దిశగా పలు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా సంపన్నులపై ఎక్కువ పన్ను భారాన్ని మోపుతూ.. గ్రామీణ భారతాన్ని, వ్యవసాయ రంగాన్ని ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. 

ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై లీటరకు రూ. 1 సెస్‌ విధించడం, బంగారం, ఇతర విలువైన అభరణాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడం మధ్యతరగతి మీద ప్రభావం చూపించేదే. ఇక వార్షికంగా రూ. రెండు నుంచి ఐదు కోట్ల ఆదాయ వర్గాలకు వర్తించే పన్నును మూడుశాతం పెంచిన నిర్మల.. రూ. 5 కోట్లు కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఏడుశాతం పెంచారు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్‌లో పెద్ద ప్రాధాన్యమే లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సహాయం కింద ఈ ఏడాది రూ. 70వేల కోట్లు అందించనున్నట్టు తెలిపారు. ఇక, నిర్మల తన చిట్టాపద్దుల్లో తెలుగు రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. ప్రస్తుత బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, నూతన రాజధాని నిర్మాణానికి నిధులు గురించి కానీ,  ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

ఇది కార్పొరేట్‌ కంపెనీల బడ్జెట్‌..
కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు కురిపించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా బడ్జెట్‌ రూపొందించారని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కేటాయింపు ఊసేలేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని విస్మరించారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని, విశాఖ రైల్వే జోన్, ఇతర ప్రాజెక్టులకు నిధులు ఊసే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున సుంకం విధించడం సామన్యుని నడ్డి విరచడమేనని దుయ్యబట్టారు. ఇది కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తయారు చేసిన బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. ఇంధన ధరల పెరుగుదలవల్ల రవాణా రంగంపై పెనుభారం పడి ధరల భారం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ చేతిలో ఆర్థికమంత్రి కీలు బొమ్మ..
కేంద్ర బడ్జెట్‌లో విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇక్కడివారికి కేటాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు కేంద్రం వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కేసులకు భయపడి సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను నోరుమెదపనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన వ్యక్తి అయినా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు.

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగింది సున్నా...
కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్‌ నిరాశపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, బడ్జెట్‌లో ఏపీకి ఒరిగింది సున్నా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ సమృద్ధి, ప్రజల స్వావలంబన దిశగా ఈ బడ్జెట్‌ కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. ఈ బడ్జెట్‌ ద్వారా పేదలకు మంచి జరుగుతుందని, యువత మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. నవభారత నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌ రోడ్డుమ్యాపు రూపొందించిందని, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఇది మార్చబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఈ బడ్జెట్‌ రూపొందిందని పేర్కొన్నారు.    


ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని హైలైట్స్‌..

బంగారం, పెట్రోల్‌పై పన్నుల మోత

  • తన తొలి బడ్జెట్‌లో బంగారం, పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నుల మోత మోగించారు. బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచారు. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశముంది. ఇక, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరగనున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులపై ప్రతి లీటర్‌పై ఒక రూపాయి సెస్‌ అదనంగా విధిస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం ఈ సెస్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక, ఏడాదికి రూ. ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి అదనంగా ఏడు శాతం పన్ను విధించారు. 

నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారికి అభినందనలు

  • ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 7 లక్షల కోట్లకుపైగా పెరిగింది
  • రూ. 11.37 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం
  • రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలకు 25శాతం కార్పొరేట్‌ పన్ను మినహాయింపు
  • తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు.. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటే ఆదాయపన్ను మినహాయింపు
  • స్టార్టప్‌లకు ఐటీ పరిశీలన నుంచి మినహాయింపు
  • తగ్గనున్న గృహ రుణాల వడ్డీ
  • రూ. 45 లక్షలలోపు గృహ రుణాలపై అదనంగా రూ. లక్షన్నర వడ్డీ తగ్గింపు
  • నూతనంగా ఇల్లు కొనుగోలు చేసేవారికి రూ. 3.5 లక్షల వడ్డీ రాయితీ
  • పాన్‌ కార్డుకు బదులు ఆధార్‌ కార్డు..
  • ఇకపై ఆధార్‌ కార్డు లేదా ప్యాన్‌ కార్డుతో ఐటీ రిటర్న్స్‌ చెల్లించవచ్చు
  • ఏడాదికి బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ కోటి దాటితే రెండు శాతం టీడీఎస్‌ పన్ను 
  • డిజిటల్‌ లావాదేవీలను పెంచేదిశగా ఈ మేరకు చర్యలు
  • వినియోగదారుల డిజిటల్‌ పేమెంట్స్‌పై చార్జీల ఎత్తివేత
  • రూ. 2 కోట్ల వార్షిక ఆదాయం దాటిన వారిపై 3శాతం సర్‌చార్జ్‌
  • ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం

  • మహిళల నాయకత్వానికి ప్రోత్సాహం కల్పిస్తాం
  • మహిళల ఆర్థిక స్వావలంబన, వారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ‘నారీ-నారాయణీ’ పథకం 
  • డ్వాక్రా మహిళలకు రూ. 5వేల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం
  • స్వయం సహాయక బృందాలకు కూడా ముద్రా యోజన వర్తింపు
  • ప్రతి స్వయం సహాయక బృందంలో ఒక మహిళకు రూ. లక్ష వరకు రుణం
  • బ్యాంకింగ్‌ రంగంలో ప్రక్షాళన చేపడుతాం 
  • బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక ఆస్తులు రూ. లక్ష కోట్లకు తగ్గాయి
  • నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు రికవరీ చేశాం
  • పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్లు కేటాయిస్తున్నాం
  • నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు ప్రాధాన్యం.. ఎన్‌బీఎఫ్‌సీలకు వన్‌ టైం క్రెడిట్‌ గ్యారెంటీ కల్పిస్తాం

రెండో కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ

  • దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తాం.
  • బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి ఇస్తాం
  • ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ
  • దేశవ్యాప్తంగా 256 జిల్లాలకు జలశక్తి అభియాన్‌ పథకం
  • మీడియా, యానిమేషన్‌, విమానాయాన రంగంలో వ్యూహాత్మక ఎఫ్‌డీఐలపై పరిశీలన
  • చిల్లర వ్యాపారులకు నూతన ఫించన్‌ పథకం
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం
  • ఉడాన్‌ పథకంతో చిన్న చిన్న పట్టనాలకు విమానాయాన సౌకర్యం
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం
  • ఉడాన్‌ పథకంతో చిన్న చిన్న పట్టనాలకు విమానాయాన సౌకర్యం

స్టార్ట్‌అప్‌ల కోసం ప్రత్యేక టీవీ చానల్‌

  • స్టార్ట్‌అప్‌ల కోసం ప్రత్యేక దూరదర్శన్‌ టీవీ చానల్‌
  • స్టాండప్‌ ఇండియా పథకం కింద బలహీన వర్గాల యువతకు శిక్షణ ఇస్తాం
  • ఇళ్లలో వాడిన నీటిని పునర్వినియోగం కింద సాగునీరుగా మార్చి పంటలకు మళ్లిస్తాం
  • భారతీయ పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరికీ ఆధార్‌ కార్డుల కేటాయింపు
  • ఎన్‌ఆర్‌ఐలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్‌ కార్డులు
  • కొత్తగా 18 దేశాల్లో భారతీయ ఎంబసీల ఏర్పాటు
  • 2019-20లో కొత్తగా నాలుగు ఎంబసీలు ఏర్పాటు చేస్తాం
  • 17 ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
  • మౌలిక రంగం అభివృద్ధికి ఐడియాస్‌ స్కీం తీసుకొస్తాం
  • ఆదివాసీ, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను డిజిటల్‌రూపంలో భద్రపరుస్తాం
  • ఉజ్వలా ఇండియా పథకం కింద 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
  • ఎల్‌ఈడీ బల్బులతో రూ. 18,341 కోట్లు మిగులు
  • పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు మరిన్ని పెంచుతాం
  • పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో అమెరికా, చైనా తర్వాత భారత్‌ నిలిచింది
  • వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తాం
  • రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలోకి హౌసింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌

సరికొత్త అంతరిక్ష శక్తిగా భారత్‌

  • ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది
  • ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం
  • స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నారైలూ పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాం

ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు

  • ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎన్నో అవకాశాలు
  • మన ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థులు రాక మరింత పెరగాలి
  • స్టడీ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులు ఇక్కడ చదివే అవకాశం
  • ఏడాదిలోగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు
  • శాస్త్ర సాంకేతిక రంగంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు
  • ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం

     
  • తక్కువ అద్దెకు ఇల్లు రెంట్‌ తీసుకునేలా ఆదర్శ అద్దె విధానం
  • దేశవ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను మరో 300 కిలోమీటర్ల మేర పెంచుతాం
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులో ఉంది
  • అక్టోబర్‌ 2 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత విసర్జనను నిషేధిస్తాం
  • విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం

కార్మిక సంక్షేమం కోసం 4 లేబర్‌ కోడ్స్‌

  • వేర్వేరు కార్మిక చట్టాలను వృవస్థీకృతం చేసి.. నాలుగు కోడ్‌లుగా రూపొందిస్తాం
  • కార్మిక చట్టాల సరళీకరణ.. కార్మిక సంక్షేమం కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లు
  • నాలుగు కోడ్‌ల కిందకు అన్ని కార్మిక చట్టాలు తీసుకొస్తాం

ప్రతి ఇంటికీ తారునీరు అందిస్తాం

  • పల్లెలు, పెదలు, రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం..
  • లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం
  • పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల​ రహదారిని మార్చుతాం
  • దేశవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందిస్తాం
  • దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్‌ పథకం అమలు చేస్తాం
  • 2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం
  • రైతుల ఆదాయం రెండింతలు చేసే విధానాలు అమలుచేస్తాం
  • పెట్టుబడి లేకుండా వ్యవసాయ పథకం.. ఈ పథకం కింద రైతులకు శిక్షణ ఇస్తాం
  • మూడేళ్లలో విద్యుత్‌, ఎల్పీజీ గ్యాస్‌ సౌకర్యం లేని ఇల్లు ఉండదు
  • పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గింపు

ప్రయాణానికి ఒక ఒకే కార్డు

  • ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణానికి ఒకే కార్డును ప్రవేశపెడతాం
  • ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తాం
  • ఒకే గ్రిడ్‌ కిందకి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాను తీసుకొస్తాం
  • పేద, మధ్యరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తాం
  • గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికే భారత్‌ మాల పథకం 
  • అద్దెకుండే వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకొస్తాం
  • దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది చిన్న వ్యాపారులకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తాం

    ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు కొనేవారికి రాయితీలు
  • ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది
  • బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తాం
  • లక్ష్యసాధనలో నమ్మకముంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది
  • బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుంది
  • ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం
  • సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం మా విధానం
  • మా ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకం
  • మేకిన్‌ ఇండియాను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
  • తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నాం
  • భారత్‌ ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం
  • ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం
  • అంతర్గత నదీ జలరవాణాను అభివృద్ధి చేసి రవాణాకు వినియోగిస్తాం
  • గంగానదిలో ప్రస్తుతం చేస్తున్న జలరవాణాను నాలుగింతలు పెంచుతాం
  • చట్టబద్ధంగా వచ్చే ఆదాయాలను మేం చిన్నచూపు చూడబోం. పాలసీ స్తంభన, లైసెన్స్‌ కోటా కంట్రోల్‌ పరిపాలన వంటి రోజులు ఇప్పుడు లేవు. భారత కార్పొరేట్‌ సంస్థలే భారత్‌కు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జాతి సంపదను పెంచుతున్నాయి. పరస్పర విశ్వాసంతో మనం వృద్ధి సాధించగలం. నిరంతర ఆర్థికావృద్ధి సాధ్యమవుతుంది.
  • భారత్‌మాలా, సాగర్‌మాలా, ఊడాన్‌ వంటి పథకాలు గ్రామీణ, పట్టణ భారతాల మధ్య  ఉన్న దూరాన్ని కలుపుతున్నాయి. మన రవాణా మౌలిక వసతులు ఎంతో మెరుగవుతున్నాయి. 
  • 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మనకు 55 ఏళ్లు పట్టింది. కానీ, హృదయంలో విశ్వాసం, నమ్మకం, ఆశావాదం, ఆకాంక్షతో కృషి చేసి.. గత ఐదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థకు ఒక టిలియన్‌ డాలర్లను జోడించాము.

  • ప్రస్తుత సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. ఐదేళ్ల కిందట ఈ విషయంలో మనం దేశం 11వ స్థానంలో ఉంది.

చాణక్య నీతి సూత్రాన్ని వల్లించిన నిర్మల

  • ‘కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’ అని చాణక్య నీతి సూత్రం చెబుతుంది. దృఢ సంకల్పంతో చేసే కృషి లక్ష్యాన్ని చేరుతుందని దాని అర్థం

ఉర్దూ సూక్తిని ఉటంకించిన నిర్మల

  • బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్‌ ఉర్దూ సూక్తిని ఉటంకించారు. ‘ యకీన్‌ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్‌ భి లే కర్‌ చిరాగ్‌ జల్తా హై’ అని పేర్కొన్నారు.

నవ, సుస్థిర భారతానికి పట్టం..

  • నవ, సుస్థిర భారతానికి ఇటీవలి ఎన్నికలు పట్టం కట్టాయి. ఓటర్లు పెద్దసంఖ్యలో ముందుకొచ్చి ఓటు వేశారు. పనిచేసే ప్రభుత్వానికి ఆమోదం తెలుపుతూ.. ప్రతి వర్గం ముందుకొచ్చి ఓటేసింది. నవ భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం
  • నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ తొలి హయాంలో పనిచేసే ప్రభుత్వంగా నిలిచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మెరుగుదల, సహకార సమాఖ్యవాదం, జీఎస్టీ కౌన్సిల్‌, ద్రవలోటు నియంత్రణ విషయంలో క్రమశిక్షణ వంటి అంశాల్లో దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ కృషి చేశారు. 


నిర్మతా సీతారామన్‌ వినూత్న నిర్ణయం
తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనదైన ముద్ర వేశారు. బ్రిటిష్‌ సంప్రదాయానికి స్వస్తి చెప్తూ.. ఆమె పట్టు వస్త్రంలో బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. గతంలో బ్రిటిష్‌ సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తెచ్చేవారు. దీనికి ముగింపు పలికిన నిర్మల.. పట్టు వస్త్రానికి రాజముద్ర వేసి.. బడ్జెట్‌ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు.

కేంద్ర కేబినెట్‌ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ బడ్జెట్‌ 2019ని ఆమోదించింది. మరికాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర బడ్జెట్‌ 2019 పత్రులు పార్లమెంటుకు చేరుకున్నాయి.

దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్‌ భేటీ అయింది. 

దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ భేటీ అయింది. మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ బడ్జెట్‌ను ఆమోదించనుంది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ముందుగా రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థికమంత్రి రాష్ట్రపతిని కలువడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బడ్జెట్‌  కాపీలను ఆమె రాష్ట్రపతికి అందించారు.  

  • నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ తొలి హయాంలో పనిచేసే ప్రభుత్వంగా నిలిచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మెరుగుదల, సహకార సమాఖ్యవాదం, జీఎస్టీ కౌన్సిల్‌, ద్రవలోటు నియంత్రణ విషయంలో క్రమశిక్షణ వంటి అంశాల్లో దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ కృషి చేశారు. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top