మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్‌ ఇండియా

True North to buy 51persantage stake in Max Bupa Health Insurance - Sakshi

డీల్‌ విలువ రూ.510 కోట్లు 

న్యూఢిల్లీ: మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్‌ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ,  ట్రూ నార్త్‌ ఫండ్‌ ఫోర్‌ ఎల్‌ఎల్‌పీకి విక్రయించామని మ్యాక్స్‌ ఇండియా తెలిపింది. ఈ డీల్‌  విలువ రూ.510 కోట్లని పేర్కొంది.  మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావాదేవీ పరంగా చూస్తే, మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.1,001 కోట్లుగా ఉంది. 

రెండేళ్లలో కొత్త బ్రాండ్‌...
ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత మాక్స్‌ బుపా డైరెక్టర్ల బోర్డ్‌కు డైరెక్టర్లను ట్రూ నార్త్‌ నామినేట్‌ చేయనున్నది. మరోవైపు మ్యాక్స్‌ ఇండియా నామినేట్‌ చేసిన డైరెక్టర్లు వైదొలుగుతారు. మ్యాక్స్‌ బ్రాండ్‌ను రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. ఈ రెండేళ్లలో దశలవారీగా మరో కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తారు. బుపా బ్రాండ్‌ నేమ్‌ మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ వాటా విక్రయం ద్వారా లభించిన రూ.511 కోట్లను ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని మ్యాక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనల్జిత్‌ సింగ్‌ చెప్పారు. కాగా భారత్‌లో ఆరోగ్య బీమా రంగం వృద్ధి చెందుతోందని, ఆరోగ్య బీమా రంగంలో మాక్స్‌ బుపాను అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా రూపొందించడమే తమ లక్ష్యమని ట్రూ నార్త్‌ పార్ట్‌నర్‌ దివ్య సెహ్‌గల్‌ చెప్పారు. ఈ లావాదేవీ విషయంలో మ్యాక్స్‌ ఇండియాకు ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా కేపీఎమ్‌జీ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వ్యవహరిస్తోంది.

ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌...
1999 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రూ నార్త్‌(ఇండియా వేల్యూ ఫండ్‌ అడ్వైజర్స్‌–ఫోర్‌ఎఫ్‌ఏ)మధ్య తరహా లాభదాయక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని ప్రపంచ స్థాయి ఉన్నత సంస్థలుగా మార్చుతోంది. ట్రూ నార్త్‌ సంస్థ ఇప్పటికే ఆరు ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ను ఆరంభించింది. వీటి మొత్తం నిధులు 280 కోట్ల డాలర్లను మించిపోయాయి. కాగా ఇంగ్లండ్‌కు చెందిన హెల్త్‌కేర్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, బుపా, మ్యాక్స్‌ ఇండియా కంపెనీలు కలసి  మాక్స్‌ బుపా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాగా ఈ వాటా విక్రయ వార్తల కారణంగా బీఎస్‌ఈలో మ్యాక్స్‌ ఇండియా షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.82.50 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top