కొత్త డెడ్‌లైన్‌ జనవరి 31

Trai may hold discussions new method to fix spectrum base price - Sakshi

కోరుకున్న టీవీ చానల్స్‌ ఎంచుకోవచ్చు: ట్రాయ్‌  

న్యూఢిల్లీ: టీవీ వీక్షకులు కోరుకున్న చానల్స్‌ ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల అమలుకు గడువు పొడిగిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిర్ణయం తీసుకుంది. నిబంధనల అమలుకు జనవరి 31 దాకా సమయం ఇస్తున్నట్లు వెల్లడించింది. అప్పటిదాకా సబ్‌స్క్రయిబర్స్‌కి ప్రస్తుత ప్యాకేజీలే కొనసాగుతాయని వివరించింది. వాస్తవానికి సర్వీస్‌ ప్రొవైడర్లంతా ఇందుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబర్‌ 28 నాటికి పూర్తి చేస్తే, కొత్త నిబంధనలు మర్నాడు .. అంటే డిసెంబర్‌ 29 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది.  ‘కొత్త నిబంధనల అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని గురువారం జరిగిన సమావేశంలో బ్రాడ్‌కాస్టర్స్, డీటీహెచ్‌ ఆపరేటర్లు, మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్లు తెలిపారు.

అయితే, ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా సబ్‌స్క్రయిబర్స్‌కి అవగాహన కల్పించేందుకు, 15 కోట్ల మంది యూజర్లు ఎంచుకునే ఆప్షన్స్‌ గురించి తెలుసుకునేందుకు మరికాస్త సమయం కావాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. దీంతో నెల రోజుల దాకా సమయమివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత ప్యాక్‌లు, ప్లాన్లు 2019 జనవరి 31 దాకా యథాప్రకారం కొనసాగుతాయి. అప్పటిదాకా ఏ ఎంఎస్‌వోకి గానీ స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు గానీ సర్వీస్‌ ప్రొవైడర్లు సిగ్నల్స్‌ను నిలిపేయకూడదు‘ అని ట్రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సబ్‌స్క్రయిబర్స్‌ ఎంచుకునే చానల్స్‌ గురించి తెలుసుకునేందుకు డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు (డీపీవో) సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి సబ్‌స్క్రయిబర్స్‌ అందరినీ కొత్త విధానానికి మార్చాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 29 నాటికి డీపీవోలు డిస్ట్రిబ్యూటర్‌ రిటైల్‌ ధరను (డీఆర్‌పీ), నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజును (ఎన్‌సీఎఫ్‌) ప్రకటించాల్సి ఉంటుంది. 

కొత్త నిబంధనలేంటంటే..  
సబ్‌స్క్రయిబర్స్‌ ప్రస్తుతం ప్రసారమయ్యే చానళ్లన్నింటికీ గంపగుత్తగా చెల్లించాల్సి వస్తోంది. వీటిలో ఇతర భాషలవి, వీక్షకులకు అక్కర్లేని చానళ్లు కూడా ఉంటున్నాయి. సబ్‌స్క్రయిబర్స్‌ తాము కోరుకున్న చానల్స్‌ని మాత్రమే ఎంచుకుని, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపే అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. తాము కోరుకున్న చానల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లించేందుకు యూజర్లకు అవకాశం లభిస్తుంది. టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు ఒక్కో చానల్‌ రేటును, బొకే కింద ఇచ్చే చానళ్ల ప్యాకేజీల రేట్లను ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది.

దీనివల్ల వీక్షకులకు భారం తగ్గుతుందని ట్రాయ్‌ చెబుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. సుమారు 100 ఉచిత చానళ్లు ఉండే బేస్‌ ప్యాకేజీ ధర రూ.130గా (18 శాతం జీఎస్‌టీ అదనం). వీటిలో దూరదర్శన్‌కి చెందిన 26 చానళ్లు తప్పనిసరిగా ఉంటాయి. అదనంగా రూ. 20 చెల్లిస్తే ఇంకో 25 స్టాండర్డ్‌ డెఫినిషన్‌ చానల్స్‌ పొందవచ్చు. అలా కాకుండా సబ్‌స్క్రయిబర్స్‌ తమకు కావాల్సిన చానళ్లను ఎంపిక చేసుకుని, వాటికి అనుగుణంగా రేటు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న వివిధ తెలుగు చానళ్ల పూర్తి ప్యాకేజీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు రూ.115 దాకా బేస్‌ ప్యాక్‌పై అదనంగా కట్టాల్సి రావొచ్చని అంచనా.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top