ఇక అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌!! | Trading till midnight !! | Sakshi
Sakshi News home page

ఇక అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌!!

May 5 2018 12:30 AM | Updated on May 5 2018 12:30 AM

Trading till midnight !! - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళలను దాదాపు అర్ధరాత్రి దాకా పెంచుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి రాత్రి 11.55 దాకా పెంచుకునేందుకు స్టాక్‌ ఎక్స్చేంజిలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నాం‘ అంటూ సెబీ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం కమోడిటీ డెరివేటివ్స్‌ విభాగం ట్రేడింగ్‌ వేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11.55 దాకా ఉంటుండగా, ఈక్విటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వేళలు ఉదయం 9.15 గం.ల నుంచి మధ్యాహ్నం 3.30 గం.ల దాకా మాత్రమే ఉంటున్నాయి. సెబీ నిర్ణయంతో ఈక్విటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వేళలను మరో ఎనిమిది గంటల మేర పొడిగించుకునేందుకు స్టాక్‌ ఎక్సే్చంజీలకు వెసులుబాటు లభించినట్లవుతుంది.

ఇటు స్టాక్స్, అటు కమోడిటీల ట్రేడింగ్‌ వేళలను అనుసంధానం చేసే ప్రయత్నాల్లో భాగంగా సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఒకే ఎక్సే్చంజీలో ఈ రెండింటి ట్రేడింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రవేశపెట్టేలా సెబీ బోర్డు గత డిసెంబర్‌లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కమోడిటీ డెరివేటివ్స్‌ ప్రస్తుతం ఎంసీఎక్స్, ఎన్‌సీడీఈఎక్స్‌లో మాత్రమే ట్రేడవుతున్నాయి.

షరతులు వర్తిస్తాయ్‌..
ట్రేడింగ్‌ వేళల పొడిగింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నియంత్రణ సంస్థ సెబీ... దీనికి కొన్ని షరతులను కూడా విధించింది. స్టాక్‌ ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు సముచిత రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలను(ఇన్‌ఫ్రా)ను ఏర్పాటు చేసుకుంటేనే ట్రేడింగ్‌ వేళలు పెంచుకునేందుకు అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది.

నిర్ణీత వేళలకు మించి టైమింగ్‌ను పెంచుకోదలచుకుంటే ముందుగా సెబీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రిస్కు మేనేజ్‌మెంటు వ్యవస్థ, సెటిల్మెంట్‌ ప్రక్రియ, మానవవనరుల(సిబ్బంది) లభ్యత, సిస్టమ్‌ సామర్ధ్యం, పర్యవేక్షణ యంత్రాంగం మొదలైన వివరాలన్నింటితో కూడిన ప్రతిపాదనను స్టాక్‌ ఎక్సే్చంజీలు సమర్పించాల్సి ఉంటుంది.


స్వాగతించిన ఎక్స్చేంజిలు..
చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించడాన్ని స్టాక్‌ ఎక్సే్చంజీలు స్వాగతించాయి. దేశీ మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. భారతీయ క్యాపిటల్‌ మార్కెట్స్‌ మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఇండియన్‌ కమోడిటీ ఎక్స్చేంజి (ఐసీఈఎక్స్‌) ఎండీ సంజిత్‌ ప్రసాద్‌ తెలిపారు.

ట్రేడింగ్‌ వేళల్లో వ్యత్యాసాల వల్ల దేశీ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు .. ప్రతికూల ప్రభావాలు చూపే రిస్కులు కూడా తగ్గుతాయన్నారు. అయితే, పొడిగించే వేళలను కేవలం ఇండెక్స్‌ డెరివేటివ్స్‌కే పరిమితం చేయాలని, స్టాక్స్‌కు కూడా వర్తింపచేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్సే్చంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రాజేశ్‌ బాహేతి అభిప్రాయపడ్డారు.

ఇన్వెస్టర్స్‌కు ప్రయోజనకరం..
ట్రేడింగ్‌ వేళలు పెంచడం దేశీ ఇన్వెస్టర్లకు ప్రయోజనకరం. ప్రతికూలంగానైనా, సానుకూలంగానైనా ప్రభావితం చేసే పరిణామాలు ఉంటే ప్రస్తుతం మన ఇన్వెస్టర్లు తక్షణం స్పందించే పరిస్థితి లేదు. ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే.. సెబీ  నిర్ణయం వల్ల పొజిషన్స్‌ను మరింత మెరుగ్గా హెడ్జింగ్‌ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటోంది. అక్టోబర్‌ 1 నుంచి ట్రేడింగ్‌ పరిమాణం మరింత పెరగవచ్చు. – విక్రమ్‌ లిమాయే, ఎన్‌ఎస్‌ఈ ఎండీ

సానుకూల పరిణామం..
ట్రేడింగ్‌ వేళలు పెంచడమనేది సానుకూల పరిణామం. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీ కమోడిటీ డెరివేటివ్‌ మార్కెట్స్‌కి అనుగుణంగా దేశీ మార్కెట్లు ట్రేడయ్యేందుకు ఇది దోహదపడుతుంది. అంతర్జాతీయంగా డెరివేటివ్‌ ఎక్సేంజీలు ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. – ఆశీష్‌ కుమార్‌ చౌహాన్, బీఎస్‌ఈ చీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement