వచ్చే నెల నుంచి మొబైల్‌ చార్జీల మోత

Telcos Set To Increase Tariffs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్‌ కాల్‌ చార్జీలకు రెక్కలు రానున్నాయి. భారీ నష్టాలతో కుదేలవుతున్న టెలికాం కంపెనీలు ఇక టారిఫ్‌ పెంపు అనివార్యమని స్పష్టం చేశాయి.  మొబైల్‌ టారిఫ్‌ల (ఫ్లోర్‌ ప్రైస్‌) నిర్ధారణలో ట్రాయ్‌, టెలికాం విభాగాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంతో కాల్‌ చార్జీల పెంపుపై అవి జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోవడం టెలికాం కంపెనీలకు కలిసివచ్చింది. వచ్చే నెల నుంచి టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌, ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌లు  సిద్ధమయ్యాయి. టారిఫ్‌లపై ఇక ఎలాంటి చర్చలు ఉండవని, టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచాలని ఇప్పటికే నిర్ణయించాయని, మున్ముందు కూడా చార్జీలు పెరుగుతాయని టెలికాం వర్గాలు స్పష్టం చేసినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ వెల్లడించింది.

టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపులో తాము జోక్యం చేసుకోమని ఓ అధికారి పేర్కొన్నారు. నూతన కాల్‌చార్జీలు అమలయ్యాక యూజర్‌నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) ఎలా కుదురుకుంటుందో తాము వేచిచూస్తామని, ఏఆర్‌పీయూలు తగిన స్ధాయిలో ఉంటే ఫ్లోర్‌ ప్రైసింగ్‌ అవసరం లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ చెప్పారు. ఏఆర్‌పీయూలు పెరిగితే టెలికాం పరిశ్రమ కోలుకుంటుందని ఆయన తెలిపారు. మరోవైపు మొబైల్‌ టారిఫ్‌లు పెంచేందుకు వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌లు సన్నద్ధమవగా, జియో టారిఫ్‌లను పెంచకుంటే తాము పెద్దసంఖ్యలో సబ్‌స్ర్కైబర్లను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. టారిఫ్‌ల పెంపునకు జియో కూడా సంకేతాలు పంపినా ఇతర టెలికాం కంపెనీలు పెంచిన స్ధాయిలో చార్జీల పెంపు ఉండదని భావిస్తున్నారు. ఇక మొబైల్‌ చార్జీల పెంపుతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ 42,000 కోట్ల స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం వంటి నిర్ణయాలతో టెలికాం పరిశ్రమ కోలుకుంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top