టెక్ మహీంద్రా లాభం రెట్టింపు! | Tech Mahindra Q4 net profit almost doubles to Rs 897 cr | Sakshi
Sakshi News home page

టెక్ మహీంద్రా లాభం రెట్టింపు!

May 25 2016 1:03 AM | Updated on Sep 4 2017 12:50 AM

టెక్ మహీంద్రా లాభం రెట్టింపు!

టెక్ మహీంద్రా లాభం రెట్టింపు!

ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి దాదాపు రెట్టింపయింది.

రూ.472 కోట్ల నుంచి రూ.897 కోట్లకు
చెల్లింపు బ్యాంక్ రేసు నుంచి నిష్ర్కమణ

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి దాదాపు రెట్టింపయింది. 2014-15 క్యూ4లో రూ.472 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.897 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.6,117 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.6,884 కోట్లకు పెరిగినట్లు టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి.పి.గుర్నాని చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే, లాభం 77 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, ఆదాయం 4 శాతం వృద్ధితో 102 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. డిజిటల్, ఆటోమేషన్, వెర్టికాలిజేషన్, తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

 సంవత్సరంలో 19 శాతం అప్
ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 19 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు,  ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.26,494 కోట్లకు పెరిగాయి. డాలర్ల పరంగా నికర లాభం 47 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 403 కోట్ల డాలర్లకు పెరిగాయి. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,977 కోట్లు పెరిగి రూ.5,189 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,151 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,05,432కు పెరిగిందని సంస్థ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 767గా ఉన్న యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 807కు పెరిగిందని తెలిపారు.

 లాభాలు ఉండవనే..: చెల్లింపు బ్యాంక్ ఏర్పాటు కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆమోదం పొందినప్పటికీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని గుర్నాని తెలిపారు. ఈ వ్యాపారం లాభాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని, మార్జిన్లు స్వల్పంగా ఉండడం వల్లే చెల్లింపు బ్యాంక్ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని వివరించారు.  ఇప్పటికే సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ, టెలినార్, చోళమండలం తదితర సంస్థలు చెల్లింపు బ్యాంక్‌ల రేసు నుంచి వైదొలిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement