టీసీఎస్‌ బోణీ భేష్‌!

TCS surprises with slower growth and softer margins in Q1 - Sakshi

క్యూ1 లాభం 8,131 కోట్లు; 11% వృద్ధి 

ఆదాయం కూడా 11 శాతం అప్‌

ఒక్కో షేర్‌కు రూ. 5 డివిడెండ్‌

ఈ క్యూ1లో 12,356 నికర ఉద్యోగాలు 

గత ఐదేళ్లలో ఇదే అత్యధికం  

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో  ఐటీ దిగ్గజం టీసీఎస్‌ మెరుగైన ఫలితాలతో బోణీ చేసింది. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం, మార్జిన్ల విషయంలో అంచనాలు మిస్‌ అయ్యాయి. జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.8,131 కోట్లకు పెరిగిందని టీసీఎస్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.7,340 కోట్ల నికర లాభం సాధించామని కంపెనీ సీఈఓ ఎమ్‌డీ రాజేశ్‌ గోపీనాథన్‌ చెప్పారు.

సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన నికర లాభం (రూ. 8,126 కోట్ల)తో పోల్చితే 0.06 శాతం వృద్ధి నమోదైంది. ఇక గత క్యూ1లో రూ.34,261 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 11% వృద్ధితో రూ.38,172 కోట్లకు పెరిగిందని గోపీనాథన్‌ పేర్కొన్నారు. 3 నెలల కాలాన్ని పరగణనలోకి తీసుకుంటే, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం. అయితే గత నాలుగు క్వార్టర్లలో ఈ కంపెనీ 16–20% ఆదాయ వృద్ధి సాధిస్తోంది. దీంతో పోల్చితే ఈ క్యూ1లో ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని గోపీనాథన్‌ తెలిపారు.  

నిలకడైన ఆరంభం....
కొత్త ఆర్థిక సంవత్సరం నిలకడైన ఆరంభంతో మొదలైందని రాజేశ్‌ గోపీనాథన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు వృద్ధి, డిజిటల్‌ మార్పుల కోసం గణనీయంగానే పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. ఫలితంగా ఈ క్యూ1లో మంచి ఆర్డర్లు, డీల్స్‌ సాధించామని తెలిపారు. ఈ క్యూ1లో డీల్స్‌ 25 శాతం వృద్ధితో 570 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో 32 శాతం వాటా ఉన్న డిజిటల్‌ ఆదాయం ఈ క్యూ1లో 42 శాతం ఎగసిందని గోపీనాథన్‌ పేర్కొన్నారు.  

13% వృద్ధితో రూ.21.67కు ఈపీఎస్‌...
మార్జిన్లు మంచి వృద్దినే సాధించాయని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి. రామకృష్ణన్‌ తెలిపారు. కార్యకలాపాల జోరుతో నగదు నిల్వలు పెరిగాయని, ఈపీఎస్‌ 13% వృద్ధితో రూ.21.67కు చేరిందని పేర్కొన్నారు.  

మరిన్ని విశేషాలు...
► ఆదాయం రూపాయల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 11 శాతం, సీక్వెన్షియల్‌గా 0.4 శాతం వృద్ధి చెందింది.  
► ఆదాయం డాలర్ల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 9 శాతం వృద్ధి చెందింది.  
► గత క్యూ1లో 25 శాతంగా, మార్చి క్వార్టర్‌లో 25.1 శాతంగా ఉన్న నిర్వహణ మార్జిన్‌ ఈ క్యూ1లో 24.2 శాతానికి తగ్గింది.  నికర మార్జిన్‌ 21.3 శాతంగా నమోదైంది. వేతన పెంపు, రూపాయి బలపడటం ప్రభావం చూపాయి.  
► ఇతర ఆదాయం సీక్వెన్షియల్‌గా 40 శాతం పెరగడంతో లాభదాయకత మెరుగుపడింది.  
► స్థూల లాభం(వడ్డీ, ట్యాక్స్‌లను కలుపుకొని) 3 శాతం క్షీణించి రూ.9,220 కోట్లకు చేరింది.
మార్కెట్‌ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి, డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతో టీసీఎస్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.2,131 వద్ద ముగిసింది.

నగదు తిరిగిచ్చే విధానం కొనసాగుతుంది...
డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) తప్పించుకోవడానికి పలు కంపెనీలు ముఖ్యంగా ఐటీ కంపెనీలు షేర్లను బైబ్యాక్‌ చేస్తున్నాయి. దీని నుంచి ఆదాయం పొందడానికి కొత్తగా 20 శాతం బైబ్యాక్‌ ట్యాక్స్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో....వాటాదారులకు నగదు నిల్వలను తిరిగిచ్చే విధానాన్ని కొనసాగిస్తామని గోపీనాథన్‌ తెలిపారు. అయితే ఎలా తిరిగివ్వాలి, తదితర విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని  పేర్కొన్నారు. మరోవైపు లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ హోల్డింగ్‌ను 35 శాతానికి పెంచే ప్రతిపాదన నేపథ్యంలో, కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా తమ వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. టీసీఎస్‌లో టాటా గ్రూప్‌కు 75 శాతానికి పైగా వాటా ఉంది.  టాటా గ్రూప్‌ మొత్తం నికర లాభంలో టీసీఎస్‌ వాటాయే 85 శాతం వరకూ ఉంటుంది.   

ఐదేళ్ల గరిష్టానికి కొత్త కొలువులు..
ఈ క్యూ1లో నికరంగా 12,356 ఉద్యోగాలిచ్చామని, గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని టీసీఎస్‌ తెలిపింది.  దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.36 లక్షలకు పెరిగింది.  30 వేల మంది తాజా గ్రాడ్యుయేట్లకు జాయినింగ్‌ లెటర్లు ఇచ్చామని, వీరిలో 40% మంది ఈ క్యూ1లో ఉద్యోగాల్లో చేరారని, మిగిలిన వాళ్లు ఈ క్యూ2లో చేరనున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) 11.5%గా ఉంది.
క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌. చిత్రంలో సీఎఫ్‌ఓ రామకృష్ణన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top