ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి

Tax Benefits on Home Loan for Joint Owners - Sakshi

మరొకరితో కలసి దరఖాస్తు చేసుకుంటే వేగంగా రుణం

ఒకరి క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉంటే చాలు

ఎక్కువ మొత్తంలో రుణం పొందేందుకు మార్గం

ఇరువురికీ పన్ను ప్రయోజనాలు

సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్‌ హోమ్‌లోన్‌ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది.
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

జాయింట్‌హోమ్‌ లోన్‌ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్‌ హోమ్‌లోన్‌ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్‌ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్‌ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి.

ఒకవేళ ఒకరి క్రెడిట్‌ రిపోర్ట్‌ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్‌ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్‌ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు.   

సానుకూలతలు
ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారం జాయింట్‌ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్‌ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది.

ప్రతికూలతలు
జాయింట్‌ లోన్‌ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి.

అపోహలకు చెక్‌
► జాయింట్‌ హోమ్‌లోన్‌ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి.   

► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్‌ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి.  

► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి.

గృహ రుణానికి అర్హతలు
ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి.  

వయసు

దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్‌ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.  

ఆర్థిక పరిస్థితి
తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి.  

క్రెడిట్‌ హిస్టరీ
దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్‌ రిపోర్ట్‌లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.

ఇతర బాధ్యతలు  
అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్‌ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి.  

వ్యక్తిగత ప్రొఫైల్‌
వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్‌ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ను రుణదాతలు చెక్‌ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.

హామీదారుగా ఉంటే
ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి.  

అర్హత ఉంటే...
అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్‌ కాస్ట్‌ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి.

అర్హతను పెంచుకునే మార్గాలు
► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది.  

► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక.  

► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది.  

► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్‌స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్‌లైన్‌లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top