బ్యాంకులకు మాల్యా బంపర్‌ ఆఫర్‌

Take My Money and Save Cash-Strapped Jet Airways says Vijay Mallya - Sakshi

ఎన్‌డీఏ డబుల్‌​ స్టాండర్డ్స్‌  

ఇవే ప్రభుత్వ బ్యాంకులు కింగ్‌ ఫిషర్‌ను ఎందుకు కాపాడలేదు -మాల్యా

ఇకనైనా నా చెల్లింపులకు అంగీకరించండి - మాల్యా

తద్వారా  జెట్‌ ఎయిర్‌వేస్‌ని రక్షించండి -మాల్యా

ఫ్యుజిటివ్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా జెట్‌ ఎయిర్‌వేస్‌ వివాదంపై స్పందించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు.  ఇప్పటికైనా దీనిపై  బ్యాంకులు పునరాలోచించాలని కోరాడు.  దీంతోపాటు సంక్షోభంలో ఉన్న తన పట్ల డబుల్‌​ స్టాండర్డ్స్‌ని  అవలంబిస్తోందంటూ మంగళవారం ట్విటర్‌లో వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు. 

అలాగే సంస్థను ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను రక్షించేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఇదే తన విషయంలో కూడా జరిగి వుంటే బావుండేదంటూ వాపోయాడు. బీజేపీ ప్రభుత్వం లోని ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆరోపిస్తూ  మాల్యా వరుస ట్వీట్లు చేశాడు.  దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ కింగ్‌ ఫిషర్‌, దాని  ఉద్యోగులు, వ్యాపారం  నిర్దాక్షిణ్యంగా కూలిపోతోంటే ఎన్‌డీఏ ఆధ్వర్యంలోని  ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని ట్వీట్‌ చేశాడు.

సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్‌ సంస్థను, సంస్థ ఉద్యోగులను  కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా  పెట్టుబడులు పెట్టానని మాల్యా చెప్పుకొచ్చాడు.  దీన్ని గుర్తించకుండా  తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నాడు.  అలాగే తన లిక్విడ్‌ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని ఆయన  ప్రశ్నించారు.  తన  సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్‌  ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు.

జెట్ ఎయిర్‌వేస్‌ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంది. దివాలా కారణంగా కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది.  దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటుండగా  గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని మాల్యా  ఆస్తుల  ఎటాచ్‌మెంట్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జులై 10న జరగనున్నాయి.

కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకు  ఛైర్మన్ నరేష్ గోయల్ ఎట్టకేలకు సోమవారం (మార్చి 25) న దిగి వచ్చారు.  ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రుణదాతలు 1500 కోట్ల రూపాయల బెయిల్  అవుట్‌ ప్యాకేజీకి  అంగీకరించిన సంగతి తెలిసిందే.  (చదవండి : గోయల్‌.. ‘జెట్‌’ దిగెన్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top