వడ్డీపై పన్ను ఎగ్గొట్టడం కష్టమే!

Surveillance IT department fouce on FD - Sakshi

ఎఫ్‌డీలపై నిఘా పెంచిన ఐటీ శాఖ

15జీ, 15హెచ్‌ ఫామ్‌లపైనా ఫోకస్‌  

సేవింగ్స్‌ ఖాతాల్లో కావచ్చు... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కావచ్చు... ఇతరత్రా కావచ్చు! వడ్డీ రూపంలో వచ్చే ఆదాయాన్ని పన్ను అధికారుల కళ్లలో పడకుండా దాచడం ఇక అసాధ్యమే. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పరిశీలనను ఆదాయపన్ను శాఖ ఇటీవలి కాలంలో విస్తృతం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా ఆదాయం పొందుతూ పన్ను చెల్లించని వారు లేదా పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిపై ఐటీ శాఖ నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పొందేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడమే శ్రేయస్కరం.

వడ్డీ ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో ఎన్నో దురభిప్రాయాలున్నాయి. వీటిలో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆదాయపన్ను శాఖకు తెలియవని అనుకోవటం కూడా ఒకటి. నిజం చెప్పాలంటే... టీడీఎస్‌ ఒక్కటి చాలు! ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి ఐటీ శాఖకు తెలియడానికి!!. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే బ్యాంకు స్థాయిలో టీడీఎస్‌ అమలు చేస్తారు. ఇది ఫామ్‌ 26ఏఎస్‌లో కనిపిస్తుంది. అంతేకాదు... ఆ ఏడాదిలో వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు కూడా ఇందులో ఉంటాయి. బ్యాంకు టీడీఎస్‌ విధిస్తే పన్ను చెల్లించక్కర్లేదనే మరో అపోహ కూడా ఉంది. కానీ వడ్డీ ఆదాయంలో టీడీఎస్‌ 10 శాతమే మినహాయిస్తారు. ఒకవేళ డిపాజిట్‌ దారుడి ఆదాయం అధిక పన్ను రేటు పరిధిలో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది కాబట్టి.

టీడీఎస్‌ బాధ్యత విస్మరించొద్దు
కొందరు టీడీఎస్‌ చెల్లించడం ఎందుకన్న ఆలోచనతో డిపాజిట్లను వేర్వేరు బ్యాంకుల్లో కొద్ది కొద్దిగా చేస్తుంటారు. కానీ, పన్ను ఎగ్గొట్టేందుకు ఇలా చేయకపోవడమే మంచిదంటున్నారు ట్యాక్స్‌ నిపుణులు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమయంలో పాన్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుందనేది క్లియర్‌ట్యాక్స్‌ డాట్‌ ఇన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్‌ గుప్తా మాట. కనుక ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్లను రహస్యంగా ఎక్కువ కాలం పాటు ఉంచే అవకాశం ఉండదు. కొందరు 15జీ, 15 హెచ్‌ ఫామ్‌లు ఇవ్వటం ద్వారా పన్ను అధికారుల కళ్లలో పడకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. వార్షికాదాయం పన్ను పరిమితికి లోపే ఉన్నవారు, టీడీఎస్‌ మినహాయించుకుంటే ఇచ్చే పత్రాలు ఇవి. వీటిని దుర్వినియోగం చేస్తే ట్యాక్స్‌ అధికారుల దృష్టిలో పడతారని, తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడం వల్ల పెనాల్టీ, విచారణలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని ట్యాక్స్‌ స్పానర్‌ డాట్‌ కామ్‌ సీఎఫ్‌వో సుధీర్‌ కౌశిక్‌ వివరించారు.

15జీ, 15హెచ్‌ దుర్వినియోగం
15జీ, 15హెచ్‌ డిక్లరేషన్‌ ఇవ్వడం ద్వారా బయటపడొచ్చన్న ఆలోచన సరికాదన్నది నిపుణుల మాట. వీటిని సమర్పించిన ఖాతాదారుల పాన్‌ నంబర్, డిపాజిట్‌ వివరాలను బ్యాంకులు తమ టీడీఎస్‌ రిటర్నుల్లో పేర్కొంటాయని ముంబైకి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సుభమ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీంతో ఈ సమాచారం ఫామ్‌ 26ఏఎస్‌లోకి చేరుతుంది. మరి ఇలా ఒకటికి మించిన బ్యాంకుల్లో 15జీ లేదా 15 హెచ్‌ పత్రాలను సమర్పించిన వివరాలు 26ఏఎస్‌లో కనిపిస్తే, ఆ ఆదాయం బేసిక్‌ పన్ను మినహాయింపు పరిమితి దాటిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పన్ను చెల్లింపు దారుల్లో దాదాపు 90 శాతం మంది వడ్డీ ఆదాయాన్ని పేర్కొనడం లేదని సమాచారం. మరి పన్ను చెల్లంపుదారులు అందరికీ బ్యాంకు ఖాతాలు తప్పకుండా ఉంటాయని తెలిసిందే. సేవింగ్స్‌ ఖాతాలో డిపాజిట్లపై వారికి ఎప్పటికప్పుడు ఆదాయం జమ అవుతూనే ఉంటుంది. సెక్షన్‌ 80టీటీఏ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించితే పన్ను చెల్లించాల్సిందే. కానీ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాల వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలు చేయకపోవడం వల్ల ఈ ఆదాయాన్ని తమ రిటర్నుల్లో చూపించని పరిస్థితి నెలకొంది.

కుటుంబ సభ్యుల పేరుపై...
ఒక్కరి పేరుతోనే పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేయకుండా ట్యాక్స్‌ పడుతుందన్న ఆలోచనతో కొందరు తమ పేరిట కొంత, కుటుంబ సభ్యుల పేరిట తలా కొంత చొప్పున డిపాజిట్‌ చేస్తుంటారు. జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే నగదు బహుమానంపై చట్టప్రకారం పన్ను ఉండదు. ఇలా బహుమానంగా ఇచ్చిన మొత్తంపై వచ్చే ఆదాయం ఇచ్చిన వారి ఆదాయంలోనే కలుస్తుంది. ఇలా మొదటి ఆదాయమే కలుస్తుంది. ఒకవేళ ఇలా వచ్చిన ఆదాయాన్ని తీసుకున్న వ్యక్తి మళ్లీ ఇన్వెస్ట్‌ చేస్తే అప్పుడు దానిపై వచ్చే ఆదాయం వారికే చెందుతుంది. ఇచ్చిన వారి ఆదాయంలో కలవదు.

తల్లిదండ్రుల పేరుపై...
కానీ, తల్లిదండ్రుల విషయానికొస్తే ఇది భిన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం ఏదైనా దానిపై పన్ను పడదు. అలాగే, ఇలా బహుమానంగా ఇచ్చిన దానిపై వచ్చే ఆదాయం తీసుకున్న తల్లిదండ్రుల ఆదాయంగానే చట్టం పరిగణిస్తుంది. జీవిత భాగస్వామి, పిల్లల మాదిరిగా ఇచ్చిన వారి ఆదాయంలో కలవదు. ఈ వెసులుబాటు ఉండడంతో అధిక పన్ను పరిధిలో ఉన్న వారు కొంత తమ తల్లిదండ్రులకు గిఫ్ట్‌ ఇవ్వడం ద్వారా పన్ను భారాన్ని దించుకోవచ్చు. చట్ట ప్రకారం 60 ఏళ్లు దాటిన వారికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉందనే విషయం తెలిసిందే. సెక్షన్‌ 80సీ ప్రయోజనాలు కూడా కలుపుకుంటే ఇది రూ.4.5లక్షలు. కనుక ఆ మేర వడ్డీ ఆదాయంపై పన్ను ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. అయితే, ఇలా తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చిన మొత్తంపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస మినహాయింపైన రూ.3 లక్షలు దాటితే దాన్ని రిటర్నుల రూపంలో చూపించడం తప్పనిసరి.

హెచ్‌ఆర్‌ఏ కూడా
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక్కటే కాదు. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) కూడా పన్ను అధికారుల నిఘాలోకి వచ్చేసింది. నకిలీ రసీదులు సమర్పించి హెచ్‌ఆర్‌ఏకు ఉన్న పన్ను మినహాయింపు పొందుతుండడమే ఇందుకు కారణం. దీంతో ఆదాయపన్ను శాఖ రూ.1.5 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గించి, ఇంతకు మించి వార్షికంగా అద్దె చెల్లిస్తుంటే భవన యజమాని పాన్‌ నంబర్‌ సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ అద్దె రూ.50,000కు మించి చెల్లించేవారు అందులో టీడీఎస్‌ కింద 5 శాతాన్ని మినహాయించి పన్ను అధికారులకు జమ చేయాల్సి ఉంటుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top