
సూరత్ వజ్రాల కంపెనీల సొంత ఎయిర్‌లైన్స్
ఉద్యోగులకు పండుగ వేళ భారీ నజరానాలు ఇస్తున్న సూరత్ వజ్రాల కంపెనీలు తాజాగా సొంత ఎయిర్‌లైన్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి.
అహ్మదాబాద్: ఉద్యోగులకు పండుగ వేళ భారీ నజరానాలు ఇస్తున్న సూరత్ వజ్రాల కంపెనీలు తాజాగా సొంత ఎయిర్‌లైన్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. సూరత్‌ను దేశ, విదేశాల్లో మిగతా ప్రాంతాలకు మరింతగా అనుసంధానించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 4 కంపెనీలు కలిసి రూ. 30-40 కోట్ల పెట్టుబడితో సొంతంగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు ప్రారంభిస్తున్నాయి.
ముందుగా గుజరాత్‌లోని మిగతా చిన్న నగరాలకు సూరత్‌ను అనుసంధానించనున్నట్లు, తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నట్లు సదరు సంస్థలు వెల్లడించాయి. ఎస్‌ఆర్‌కే ఎక్స్‌పోర్ట్స్, అవధ్-అంజనీ గ్రూప్, ధర్మానంద్ డైమండ్స్, హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ దీన్ని ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రెండు నైన్-సీటర్ ప్లేన్లు, ఒక ఫోర్ సీటర్ విమానాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాయి. భోపాల్‌కు చెందిన వెంచురా ఎయిర్‌లైన్ నుంచి లెసైన్సు తీసుకున్నాయి. దీపావళి నుంచి సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.