స్టాక్స్‌ వ్యూ

stock view

లుపిన్‌       కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌  
ప్రస్తుత ధర: రూ.1,061
టార్గెట్‌ ధర: రూ.1,251
ఎందుకంటే: లుపిన్‌ కంపెనీ ఇటీవలే సిమిబియోమిక్స్‌ కంపెనీని కొనుగోలు చేసింది. మహిళలకు సంబంధించి బ్రాండెడ్‌ హెల్త్‌ డివిడిజన్‌ను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే బ్యాక్టీరియల్‌ వెజినోసిస్‌ చికిత్సలో ఉపయోగించే సొలోసెక్‌ (సెనిడాజోల్‌) ఓరల్‌ గ్యాన్సూల్స్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం పొందింది. బ్యాక్టీరియల్‌ వెజినోసిస్‌(బీవీ)కు సింగిల్‌ డోస్‌ ఓరల్‌ ట్రీట్‌మెంట్‌నిచ్చే సొలోసెక్‌ ఔషధాన్ని  వచ్చే ఏడాది జూన్‌ నుంచి  మార్కెట్లోకి తేవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.

కనీసం పదేళ్లపాటు ఈ ఔషధంపై మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. బీవీకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెట్రోనిడాజోల్‌ క్రీమ్, టినిడాజోల్‌ల కంటే ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా సొలోసెక్‌ నిలవనున్నది. సొలోసెక్‌ మార్కెట్లోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కనీసం 15–20 శాతం మార్కెట్‌ వాటా ్జకైవసం చేసుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, కెనడాల్లో కూడా ఈ ఔషధాన్ని అందించాలని లుపిన్‌ యోచిస్తోంది. ఇక ఇప్పటికే వివిధ కారణాల వల్ల షేర్‌ ధర బాగా తగ్గింది.

కంపెనీ అమెరికా మార్కెట్‌కు చెందిన ప్రధాన వ్యాపారానికి సంబంధించి ధరల ఒత్తిడి, పోటీ తీవ్రత మరికొంత కాలం కొనసాగవచ్చు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) రెండో అర్థభాగం నుంచి కంపెనీ ఆదాయం మెరుగుపడే అవకాశాలున్నాయి. కీలకమైన కొన్ని ఔషధాలను మార్కెట్లోకి విడుదలచేయనుండడం, స్పెషాల్టీ బిజినెస్‌ పోర్ట్‌ఫోలియో పునర్‌వ్యవస్థీకరణ దీనికి ప్రధాన కారణాలు.   

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌     కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.572
టార్గెట్‌ ధర: రూ.725
ఎందుకంటే: షిప్‌ బిల్డింగ్, రిపేర్ల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ ఇది. ఈ రెండు రంగాల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. జాతీయ భద్రత అంశం కావడంతో మన నావికాదళ షిప్‌ బిల్డింగ్, షిప్‌ రిపేర్లు దీనికే లభిస్తాయి. నామినేషన్‌ ప్రాతిపదికన అధికంగా ఆర్డర్లు కూడా ఈ కంపెనీకే లభిస్తాయి. మంచి పనితీరు కొనసాగిస్తున్న అతి కొన్ని పీఎస్‌యూల్లో ఇదొకటి. గత పదేళ్లలో కంపెనీ ఆదాయం 11%, నికర లాభం 19% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి.

2012–17 కాలంలో ఏడాదికి సగటున 16 శాతం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) ని ఈ కంపెనీ సాధించింది.  అంతర్జాతీయంగా షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనా, భారత రక్షణ రంగంలో నిర్ణయాధికారం మందగమనంగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించడం విశేషం. కంపెనీ చేతిలో రూ.2,856 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. రూ.5,400 కోట్ల ఆర్డర్లకు సంబంధించి ప్రాజెక్టుల్లో ఈ కంపెనీకి ఎల్‌ 1 స్టేటస్‌ ఉంంది. మరోవైపు  రూ.11,900 కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

షిప్‌ బిల్డింగ్‌ బిజినెస్‌ కంటే రెండు రెట్లు లాభాలు వచ్చే షిప్‌ రిపేర్‌ విభాగంలో ఆర్డర్లు పెరుగుతున్నాయి. రూ.2,768 కోట్ల పెట్టుబడులతో కొత్తగా షిప్‌ బిల్డింగ్, షిప్‌ రిపేర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 18 శాతం, ఇబిటా 14 శాతం, నికర లాభం 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. పటిష్టమైన బిజినెస్‌ మోడల్, అర్డర్లు బాగా ఉండడం, భారీ స్థాయిలో మరిన్ని ఆర్డర్లు రానుండడం, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండడం, డివిడెండ్‌ల చెల్లింపు ఆరోగ్యకరంగా ఉండడం....ఇవన్నీ సానుకూలాంశాలు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top