సెన్సెక్స్‌ రికార్డుస్థాయికి చేరేముందు...

stock market is aligned with a historical pattern with perfect track record - Sakshi

మార్కెట్‌ పంచాంగం

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో ఉన్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్‌ ఫెవరేట్‌ రంగమైన బ్యాంకింగ్‌ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై తిరిగి కఠిన వైఖరిలోకి మారకపోతే...ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు–అంచనాలతో సంబంధం లేకుండా ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయని అత్యధికశాతం బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,   

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మార్చి 15తో ముగిసిన వారంలో అనూహ్యంగా ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,250 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంకంటే 1,353 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి, 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 29 నాటి రికార్డు గరిష్టస్థాయి 38,989 పాయింట్ల స్థాయివరకూ ర్యాలీ చేయడానికి అవసరమైన కీలక అవరోధాల్ని అన్నింటినీ సెన్సెక్స్‌ గతవారం అధిగమించినట్లే. అయితే లాభాల స్వీకరణ కారణంగా రికార్డుస్థాయిని చేరేముందు చిన్న విరామాలు వుండవచ్చు. ఈ కోణంలో.... ఈ వారం అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలుత 38,250–38,420 పాయింట్ల శ్రేణి వద్ద ఆగవచ్చు. అటుపైన ముగిస్తే 38,580 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన 38,730–38,989 పాయింట్ల శ్రేణి వరకూ పరుగు కొనసాగవచ్చు. ఈ వారం తొలి స్టాప్‌ వద్ద బ్రేక్‌పడితే 37,700 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.  

నిఫ్టీ తక్షణ మద్దతు 10,345
గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,487 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు  అంతక్రితంవారంతో పోలిస్తే 392 పాయింట్ల భారీ లాభంతో 11,427 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 28 నాటి రికార్డు గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్ల వద్దకు చేరేందుకు సాంకేతికంగా కీలక అవరోధమైన 11,345 పాయింట్ల స్థాయిని గతవారం అవలీలగా నిఫ్టీ అధిగమించింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కొత్త రికార్డుల సాధనకు మార్గం సుగమమయ్యింది. ఈ క్రమంలో ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగితే వెనువెంటనే 11,490–11,525 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 11,605 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 11,700–11,760 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం 11,490–11, 525 పాయింట్ల శ్రేణిని దాటలేకపోతే 11,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,275 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top