శ్రీసిటీలో షావొమీ ఫోన్ల తయారీ | Sri City in preparation for xiaomi phones | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో షావొమీ ఫోన్ల తయారీ

Aug 11 2015 12:04 AM | Updated on Aug 18 2018 6:05 PM

శ్రీసిటీలో షావొమీ ఫోన్ల తయారీ - Sakshi

శ్రీసిటీలో షావొమీ ఫోన్ల తయారీ

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది...

ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం
- రెడ్‌మీ2 ప్రైమ్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు
- మొబైల్ ధర రూ. 6,999
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో జట్టు కట్టింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో రూపొందించిన రెడ్‌మీ2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో దీన్ని ఆవిష్కరించారు. ఈ ఫోన్ ధర రూ. 6,999. వస్తు తయారీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు.  

‘మేకిన్ ఇండియా - ‘మేడిన్ ఏపీ’అనే విధానంతో పారిశ్రామిక సంస్థలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వస్తు తయారీ పరిశ్రమకు అవసరమైన అనుమతులన్నీ ఆన్‌లైన్ విధానంలో రెండువారాల్లోనే మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, చైనా కాకుండా బ్రెజిల్‌లో కూడా తమకు ప్లాంటు ఉందని, భారత్‌లోనిది రెండోదని షావొమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా తెలిపారు. ఇక్కడి ప్లాంటు నుంచి త్వరలో మరిన్ని డివైజ్‌లను కూడా ప్రవేశపెట్టగలమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ కాంత్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఆన్‌లైన్లో లభ్యం..
రెడ్‌మీ2 ప్రైమ్‌లో 2జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, మిడాట్‌కామ్ ఆన్‌లైన్ సైట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచీ రెడ్‌మీ 1ఎస్, రెడ్‌మీ2 మొదలైన స్మార్ట్‌ఫోన్లు ముప్పై లక్షలపైచిలుకు విక్రయించినట్లు ఆయన వివరించారు. ఇక ఇప్పుడు భారత్‌లోనే తయారీ కూడా మొదలుపెట్టడం వల్ల డెలివరీ సమయం 3-4 వారాల నుంచి 2 వారాలకు తగ్గగలదని షావొమీ భారత విభాగం హెడ్ మనూ జైన్ చెప్పారు.

బ్రెజిల్ తరహాలోనే భారత మార్కెట్ అవసరాలకు మాత్రమే ఇక్కడి ఉత్పత్తిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ ప్రస్తుతం యాపిల్ ఫోన్లను కూడా తయారు చేస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, స్పైస్ తదితర మొబైల్ సంస్థలు ఇప్పటికే భారత్‌లో తమ ఫోన్లను అసెంబుల్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా షావొమీ కూడా ఆ జాబితాలో చేరినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement