సర్వీసులకు ‘సిల్క్‌’ టాటా! | Silk Airlines Close to Visakhapatnam Services | Sakshi
Sakshi News home page

సర్వీసులకు ‘సిల్క్‌’ టాటా!

Dec 26 2018 7:19 AM | Updated on Dec 26 2018 7:19 AM

Silk Airlines Close to Visakhapatnam Services - Sakshi

సింగపూర్‌ సిల్క్‌ ఎయిర్‌వేస్‌ విమానం

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం–సింగపూర్‌ల మధ్య వారానికి మూడు రోజులు నడుస్తున్న సిల్క్‌ ఎయిర్‌ వేస్‌ తన సర్వీసులకు గుడ్‌బై చెప్పనుంది. 2011 నుంచి నడుస్తున్న ఈ సర్వీసు అంతగా లాభదాయకంగా లేకపోవడంతో వచ్చే అక్టోబర్‌ నుంచి సేవల నుంచి నిష్క్రమించనుంది.

అప్పట్లో విశాఖ నుంచి నేరుగా సింగపూర్‌కు ప్రారంభమైన తొలి సర్వీసు ఇదే. గ్లోబల్‌ డెస్టినేషన్‌ సర్వీసు (జీడీఎస్‌)గా ఇది ఏడేళ్ల నుంచి నడుస్తోంది. ఈ ఎయిర్‌లైన్స్‌ టిక్కెట్టు ధరలోనే ప్రయాణికులకు భోజనం సమకూరుస్తుంది. అంతేకాదు.. 30 కేజీల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. టిక్కెట్టు ధర డిమాండ్‌ను బట్టి రూ.14–20 వేల వరకు ఉంది. అయితే ఈ సర్వీసుకు ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో రద్దు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దాని స్థానంలో అదే యాజమాన్యానికి చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసును నడపాలని తాజాగా నిర్ణయించింది. ఇది లోకాస్ట్‌ కారియర్‌ (ఎల్‌సీసీ). ఈ స్కూట్‌ సర్వీసులు దేశంలోని విశాఖలాంటి టైర్‌–2 శ్రేణి నగరాలకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నడుపుతోంది.

ఈ విమాన చార్జీలు మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ విమాన టిక్కెట్టు విశాఖ నుంచి సింగపూర్‌కు రూ.11–14 వేల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో ఏడు కిలోల వరకు లగేజిని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించే అవకాశం ఉంది. వచ్చే అక్టోబర్‌ 27 నుంచి ప్రస్తుతం నడుస్తున్న సిల్క్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసు నిలిచిపోనుండగా, అదే నెల 29 నుంచి విశాఖ–సింగపూర్‌ల మధ్య కొత్త స్కూట్‌ ఎయిర్‌ సర్వీసు నడపాలని నిర్ణయించింది. దీంతో ఏడేళ్లుగా విశాఖలోని సిరిపురంలో నడుస్తున్న సిల్క్‌ ఎయిర్‌వేస్‌ కార్యాలయం మూతపడి, దాని స్థానంలో స్కూట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీసు ప్రారంభమవుతుందన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement