యాక్సిస్‌ కష్టం... ‘కొటక్‌’కు లాభం?

Short-Term Pain Likely For Axis Bank Investors  - Sakshi

యాక్సిస్‌ను విలీనం చేసుకుంటే బెటర్‌

దానికి ఇదే మంచి తరుణం: బ్రోకింగ్‌ సంస్థ నొమురా విశ్లేషణ

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... దేశీ బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ విలీన, కొనుగోలు డీల్‌కు తెరతీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా శిఖా శర్మ వైదొలిగిన తర్వాత.. ఆ బ్యాంక్‌ను కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవడంపై కొటక్‌ మహీంద్రా దృష్టి పెట్టడానికి అవకాశాలున్నాయని బ్రోకింగ్‌ సంస్థ నొమురా పేర్కొంది. కొత్త సీఈవోగా బయటి నుంచి వేరెవరినైనా తీసుకొచ్చేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద తక్కువ సమయమే ఉండటం, మొండిబాకీల ప్రక్షాళనపై ఆర్‌బీఐ నుంచి ఒత్తిడి పెరుగుతుండటం తదితర అంశాలు కొటక్‌కు సానుకూలాంశాలు కాగలవని వివరించింది.

యాక్సిస్‌ బ్యాంక్‌ యాజమాన్యంపై రిజర్వ్‌ బ్యాంక్‌ నమ్మకం సడలిందని, శిఖా శర్మ పునర్నియామకాన్ని ఆమోదించకపోవడమే ఇందుకు నిదర్శనమని నొమురా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో తాత్సారం చేయడానికి యాక్సిస్‌ బ్యాంక్‌ దగ్గర పెద్దగా సమయం కూడా ఉండకపోవచ్చని వివరించింది.

కొటక్‌కి ప్రయోజనకరం..: యాక్సిస్‌ ఇప్పటికే ఎన్‌పీఏల ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం చేయడం కొటక్‌కి కలిసి రాగలదని తెలిపింది. గతంలో విలీన వార్తలు వచ్చినప్పట్నుంచి యాక్సిస్‌తో పోలిస్తే కొటక్‌  బ్యాంక్‌ షేర్లు 30 శాతానికి పైగా పెరగడం కూడా దానికి సానుకూలాంశమని పేర్కొంది.

ఇక గణనీయమైన వ్యాపారపరిమాణం ఉన్న యాక్సిస్‌ను దక్కించుకోవడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజాల స్థాయికి కొటక్‌ మహీంద్రా మరింత చేరువ కాగలదని నొమురా తెలిపింది. అటు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్ల వాటాలను తగ్గించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని వివరించింది.

యాక్సిస్‌ షేరు జూమ్‌..:సీఈవోగా శిఖా శర్మ పదవీకాలాన్ని కుదించడం తదితర వార్తల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు మంగళవారం 5 శాతం ఎగిసింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,212 కోట్లు పెరిగి రూ. 1,40,133 కోట్లకు చేరింది.

బీఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 5.43 శాతం పెరిగి రూ. 546 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 5.17 శాతం పెరిగి రూ. 546.15 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 6.10 శాతం కూడా పెరిగి రూ. 549.50 స్థాయిని కూడా తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 2 కోట్లు, బీఎస్‌ఈలో 11.98 లక్షల షేర్లు చేతులు మారాయి. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top