సేవా పన్నుల మోత | service tax raised to 14 percent | Sakshi
Sakshi News home page

సేవా పన్నుల మోత

Mar 1 2015 5:56 AM | Updated on Sep 2 2017 10:08 PM

వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..

- 14 శాతానికి సర్వీస్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సేవా పన్నుల పెంపు ద్వారా అందరిపైనా మరింత భారం మోపారు. ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, విద్యా సెస్సును కలిపి మొత్తం రౌండ్ ఫిగరు 14 శాతం చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్లలో తిన్నా, హోటళ్లలో ఉన్నా, విమాన ప్రయాణాలు చేసినా, బ్యూటీ పార్లర్లకెళ్లినా మరింత అధికంగా చెల్లించాల్సి రానుంది. ఇక కేబుల్.. డీటీహెచ్ సేవలు, కొరియర్ సర్వీసులు, క్రెడిట్..డెబిట్ కార్డు సంబంధిత సేవలు, దుస్తుల డ్రై క్లీనింగ్ మొదలైనవి కూడా భారం కానున్నాయి. మరోవైపు, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్, బీమా సేవలతో పాటు ఇతరుల నుంచి పొందే చాలా మటుకు సర్వీసులు ప్రియం కానున్నాయి.
 
అయితే, కొన్ని ఉత్పత్తుల ప్రీ కూలింగ్, రిటైల్ ప్యాకింగ్, లేబులింగ్ మొదలైన వాటిని సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడంతో ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, కూరగాయల రేట్లు కొంత తగ్గనున్నాయి. పేషెంట్లకు అందించే అంబులెన్స్ సర్వీసులను సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, మ్యూజియాలు, జూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి సందర్శకులకు కూడా సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, అమ్యూజ్‌మెంట్ పార్కులు.. థీమ్ పార్కులు లాంటి వాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవడంతో వీటిని సందర్శించడం మరికాస్త ఖరీదైన వ్యవహారం కానుంది. లాటరీ టికెట్లను సేవా పన్ను పరిధిలోకి చేర్చడంతో ఇకపై వీటి ధరలు పెరగనున్నాయి.
 
ధూమపాన ప్రియులకు వాత..: ఎప్పటిలాగానే ఈ బడ్జెట్‌లో కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు వాత తప్పలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు ఆర్థిక మంత్రి. 65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుండే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 25 శాతం మేర, మిగతా వాటిపై 15 శాతం మేర పెంచారు. ఇక ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ. 1,000కి పెంచడంతో సిమెంటు రేట్లు మరింత పెరగనున్నాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు మొదలైన వాటిపైనా సుంకాన్ని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. అలాగే ఫ్లేవర్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ సైతం మరింత ప్రియం అవుతాయి.


ఫోన్ బిల్లులూ భారం..: సర్వీస్ ట్యాక్స్ పెంపు భారాన్ని టెలికం కంపెనీలు వినియోగదారులకు బదలాయించనుండటంతో ఇకపై ఫోన్ బిల్లులూ భారం కానున్నాయి. దీనివల్ల బిల్లులు అరశాతం మేర పెరగవచ్చని జీఎస్‌ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు.


కొంత ఊరట..: దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్లు, ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ ప్యానెల్స్, ఎల్‌ఈడీ లైట్లు, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌పైనా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో  ధరలు తగ్గనున్నాయి. వివిధ పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్ల ధరలు తగ్గనున్నాయి. అగర్‌బత్తీలపై సుంకాన్ని ఎత్తేయడంతో చవకగా లభించనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement