ఫెడ్ భయాలతో.. 231 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ | Sensex slumps by 231 points on rekindled US Fed rate hike | Sakshi
Sakshi News home page

ఫెడ్ భయాలతో.. 231 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Dec 4 2015 3:19 AM | Updated on Oct 1 2018 5:32 PM

ఫెడ్ భయాలతో.. 231 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ - Sakshi

ఫెడ్ భయాలతో.. 231 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు వెలువడడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.

25,887 పాయింట్ల వద్ద ముగింపు
67 పాయింట్లు క్షీణించి 7,864కు చేరిన నిఫ్టీ

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు వెలువడడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నవంబర్‌లో సేవల రంగం వృద్ధి తగ్గడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. వరుసగా  రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువన ముగిశాయి. ట్రేడింగ్ చివరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 25,887 పాయింట్లు వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 7,864 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే అతి పెద్ద పతనం. ఎఫ్‌ఎంసీజీ, వాహన, కొన్ని బ్యాంక్, ఆర్థిక సేవల కంపెనీల షేర్లు నష్టపోయాయి.  అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం వ్యక్తం చేసారని, దీంతో  సున్నా వడ్డీరేట్ల శకం ముగిసిందని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.

 ఐదు సెన్సెక్స్ షేర్లకే లాభాలు
 30 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మాత్రమే  పెరిగాయి. వర్షాలు భారీగా కురుస్తుండటంతో చెన్నైలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు ఐటీ, వాహన షేర్ల ధరల పతనం కొనసాగుతోంది.

 యూరో మార్కెట్లకు భారీ నష్టాలు
 ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈసీబీ ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాలతో యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ ఈసీబీ చర్యలు ఆశించిన స్థాయిలో లేవన్న అంచనాలతో  భారీ నష్టాల్లో ముగిశాయి.

 వచ్చే ఏడాది చివరకు సెన్సెక్స్  29,000 పాయింట్లకు!
 ప్రస్తుతం 25,887 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ వచ్చే ఏడాది చివరికల్లా 29,000 పాయింట్లకు చేరుతుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది. అనుకూలమైన అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని వివరించింది. కంపెనీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుం డడం, కమోడిటీ ధరల తగ్గుముఖం, పట్టణ వినియోగం మెరుగుదత వంటివి సానుకూలాంశాలని వివరించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement