ఫలితాలపై పెరిగిన ఆశలు!!

Sensex jumps 160 points to close at 38,767, Nifty settles at 11,643 - Sakshi

రూపాయి పతనమైనా, లాభాల్లోనే మార్కెట్‌

160 పాయింట్లు ఎగసి 38,767కు సెన్సెక్స్‌

47 పాయింట్లు పెరిగి 11,643కు నిఫ్టీ  

కంపెనీలు వెలువరించే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే ఆశావహ అంచనాలతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన స్థాయిలపైన ముగిశాయి. రోజంతా 264 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 160 పాయింట్ల లాభంతో 38,767 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,643 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్, ఆర్థిక రంగ, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్తు, కొన్ని వాహన షేర్లు లాభపడగా, టెలికం, క్యాపిటల్‌ గూడ్స్, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, ప్రధాన స్టాక్‌ సూచీలు నిరాశపరిచాయి. సెన్సెక్స్‌ 95 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

264 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
రూపాయి బలహీనపడినప్పటికీ, ఫలితాలపై ఆశావహ అంచనాలతో మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయి కంటే తక్కువగానే ఉంటాయన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ట్రే డింగ్‌ చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ ఒక దశలో 52 పా యింట్లు పతనం కాగా, మరో దశలో 212 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 264 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. స్టాక్‌మార్కెట్‌పై స్వల్ప కాలంలో ఎన్నికలు, కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు.  

► ఐటీసీ షేర్‌ 3.14 శాతం లాభంతో రూ.306 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన        షేర్‌ ఇదే.  
► స్పైస్‌జెట్‌ షేర్‌ 9 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఈ కంపెనీ కొత్తగా 16 బోయింగ్‌ 737–800 విమానాలను ఆర్డరిచ్చిందన్న వార్తలు దీనికి ప్రధాన కారణం. గత రెండు రోజుల్లో ఈ షేర్‌ 17 శాతం లాభపడింది.  
► క్యూ4 ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు మిశ్రమంగా ముగిశాయి. ఇన్ఫోసిస్‌ షేర్‌ 0.6 శాతం లాభంతో రూ. 748 వద్ద, టీసీఎస్‌ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిశాయి.  
► అంతర్జాతీయంగా వృద్ధిపై ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. చైనా ఎగుమతుల గణాంకాలు ఒకింత మెరుగ్గా ఉండటంతో సానుకూల ప్రభావం కనిపించింది. షాంగై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ఆరంభమై, అదేరీతిన ముగిశాయి.  
 

మే 31 నుంచి ఎన్‌ఐఐటీ ఓపెన్‌ ఆఫర్‌!
 జూన్‌ 14న ముగింపు
ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ఓపెన్‌ ఆఫర్‌ వచ్చే నెల 31నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలో 30 శాతం వాటాను బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా కంపెనీ రూ.2,627 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ  కొనుగోలు కారణంగా బారింగ్‌ కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌లో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ  26 శాతం ఓపెన్‌ ఆఫర్‌ను కూడా కలిపితే బారింగ్‌ సంస్థ మొత్తం రూ.4,890 కోట్ల ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కోసం వెచ్చించనుంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ మే 31న ప్రారంభమై, జూన్‌ 14న ముగుస్తుంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 1.62 కోట్ల షేర్లను బారింగ్‌ సంస్థ కొనుగోలు చేస్తుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top