పాలసీని స్వాగతించని మార్కెట్‌!

Sensex ends lower, Nifty holds 11,600 post RBI policy - Sakshi

192 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడింగ్‌

ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం

రూపాయి భారీ నష్టం...

అంచనాలకు తగ్గట్లుగానే ఆర్‌బీఐ రేట్ల కోత ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. అంతేకాకుండా తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 38,700 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సేవల రంగం గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. ప్రధాన స్టాక్‌ సూచీలు ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 192 పాయింట్లు పతనమై 38,685 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి.  

అంచనాలకు తగ్గట్లే రేట్ల కోత  
అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. అంతంతమాత్రం వృద్ధితో మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గింది. దీంతో రెపో రేటు ఏడాది కనిష్ట స్థాయి 6 శాతానికి చేరింది. ఈ రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభిస్తాయి. నెలవారీ వాయిదాలు చౌక అవుతాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7.2 శాతానికి  తగ్గిస్తున్నామని ఆర్‌బీఐ పేర్కొంది.

ముడి చమురు ధరలు పుంజుకుంటుండటంవల్ల తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని వివరించింది. కొత్త వర్క్‌ ఆర్డర్లు మందగమనంగా ఉండటంతో మార్చిలో భారత సేవల రంగం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.5 శాతంగా ఉన్న నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఈ మార్చిలో 52కు పడిపోయింది. మూడు రోజులుగా లాభపడుతున్న రూపాయి గురువారం భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21ను తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ మినహా మిగిలిన ఆసియా సూచీలు లాభపడ్డాయి.

కొనసాగిన లాభాల స్వీకరణ...
ప్రధాన స్టాక్‌ సూచీలు బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెలువడే వరకూ పరిమిత శ్రేణి లాభ, నష్టాల్లోనే సూచీలు ట్రేడయ్యాయి.  మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత అమ్మకాల జోరు పెరిగి నష్టాలు కూడా పెరిగాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 62 పాయింట్లు లాభపడగా, మరో దశలో 296 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 358 పాయింట్ల రేంజ్‌లో కదిలింది.

మిశ్రమంగా ‘వడ్డీ’ ప్రభావిత షేర్లు...
వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ  షేర్లు మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, ఐషర్‌ మోటార్స్, టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు 3–1 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌  లేలాండ్‌ షేర్లు చెరో అరశాతం మేర నష్టపోయాయి. బ్యాంక్‌ షేర్లలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 2.2 శాతం, ఎస్‌బీఐ 0.3 శాతం మేర లాభపడగా, యస్‌ బ్యాంక్‌ 2 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.8 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 1 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌0.4 శాతం చొప్పున నష్టపోయాయి.  

► టీసీఎస్‌ సెన్సెక్స్‌లో భారీగా 3.1 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది.
► రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.46 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,04,506 కోట్లకు పడిపోయింది.  
► షేర్ల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నదన్న వార్తలతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 2 శాతం క్షీణించి రూ.268 వద్ద ముగిసింది.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top