లాభ, నష్టాల దోబూచులాట

Sensex ends flat, Nifty below 10,400; midcaps see strong trade - Sakshi

తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు

376 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌

10 పాయింట్ల నష్టంతో 34,432 వద్ద ముగింపు

వంద పాయింట్ల రేంజ్‌లో తిరిగిన నిఫ్టీ 

6 పాయింట్ల నష్టంతో 10,380 వద్ద ముగింపు

రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైన స్టాక్‌ సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. క్యాపిటల్‌ గూడ్స్, బ్యాంక్, వాహన, లోహ షేర్ల లాభాలను ఐటీ, ఫార్మా, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు హరించివేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరిలిపోతుండటం ప్రతికూల ప్రభావం చూపించింది. స్టాక్‌ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి.  రోజంతా 376 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు  10 పాయింట్లు నష్టపోయి 34,432 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ట్రేడింగ్‌ ఆద్యంతం వంద పాయింట్ల రేంజ్‌లో కదలాడిన  నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 10,380 పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయి రికవరీ కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. గత నెల వాహన విక్రయాలు ఒకింత మెరుగ్గా ఉండటంతో వాహన షేర్లు లాభపడ్డాయి.  

లాభాల స్వీకరణతో క్షీణించిన సూచీలు... 
ఆసియా మార్కెట్ల దన్నుతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. సరళతర వ్యాపార విధానాల్లో భారత ర్యాంక్‌ వంద నుంచి 77వ స్థానానికి ఎగబాకడం, వరుసగా 15వ నెలలోనూ భారత తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ పెరగడం, దాదాపు ఐదు నెలల తర్వాత అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్లకు పెరగడం, చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం, తదితర అంశాలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభంలో  కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ 238 పాయింట్ల లాభంతో 34,680 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇటీవల లాభపడిన బ్లూ చిప్‌ షేర్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది.  139 పాయింట్ల నష్టంతో 34,303 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  ఇక నిఫ్టీ  10,442, 10,342 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. అంటే ఒక దశలో 55 పాయింట్లు లాభపడి, మరో దశలో 45 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్‌ మొత్తంలో సెన్సెక్స్‌ ఐదు సార్లు, నిఫ్టీ నాలుగు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య రచ్చ దాదాపు సమసిపోయిందనే అంచనాలతో మార్కెట్‌ సానుకూలంగానే ఆరంభమైందని నిపుణులు పేర్కొన్నారు. బుధవారం సెన్సెక్స్‌ 551 పాయింట్లు లాభపడటంతో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుందని,  దీంతో స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయ్యాయని వారు పేర్కొన్నారు.  
►ఇన్ఫోసిస్‌ 3 శాతం నష్టపోయి రూ.666 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.   
► యస్‌ బ్యాంక్‌ 8.3 శాతం లాభంతో రూ.204 వద్ద ముగిసింది. 

యూపీఐ ద్వారా ఐపీఓ చెల్లింపులు 
రిటైల్‌ ఇన్వెస్టర్లు ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లో యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా షేర్లను కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది జనవవరి 1 నుంచి యూపీఐ విధానంలో చెల్లింపులను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ అందుబాటులోకి తెస్తోంది. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్‌ సమయం ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గనున్నది. ఈ కొత్త చెల్లింపుల విధానం కారణంగా ప్రస్తుత విధానం సామర్థ్యం మరింతగా పెరుగుతుందని, వివిధ దశల్లో మానవ జోక్యం తగ్గుతుందని సెబీ పేర్కొంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top