
న్యూఢిల్లీ: వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా లిస్టెడ్ కంపెనీల కీలక ఆర్థిక ఫలితాల లీకేజీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ,స్టాక్ ఎక్స్చేంజ్ లు దృష్టి సారించాయి. రెండు డజన్లకు పైగా కంపెనీల వ్యాపార లావాదేవీలను పరిశీలించడం ప్రారంభించాయి. పలు లిస్టెడ్ బ్లూ–చిప్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సదరు కంపెనీలు నిబంధనలేమైనా ఉల్లంఘించాయా అన్న కోణంలో.. గడిచిన పన్నెండు నెలల్లో ఆయా సంస్థల ట్రేడింగ్ వివరాలను స్టాక్ ఎక్స్చేంజ్ లు విశ్లేషిస్తున్నాయి. అటు సెబీ సైతం డేటా వేర్‌హౌస్, సొంత ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ సహాయం ద్వారా ఈ అంశాలను పరిశీలిస్తోందని సమాచారం. సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ధరను ప్రభావితం చేసే ఆర్థికాంశం ఏదైనా సరే లిస్టెడ్ కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజ్ ద్వారానే బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
కాల్ డేటా రికార్డుల మీదా కన్ను..
లిస్టెడ్ సంస్థల ఆర్థికాంశాలను వాట్సాప్‌లో లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కాల్ డేటాపైనా సెబీ దృష్టి పెట్టింది. ఆయా వ్యక్తుల కాల్ డేటా రికార్డులు (సీడీఆర్) ఇవ్వాలంటూ టెలికం కంపెనీలను సెబీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
పలు పేరొందిన బ్రోకరేజి సంస్థల పేరుతో లిస్టెడ్ కంపెనీల సమాచారం ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలతో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బైటికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటివి అరికట్టేందుకు సెబీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.