డైరెక్ట్‌ చేస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌ చేస్తున్నారు..!

Published Wed, Mar 8 2017 12:47 AM

డైరెక్ట్‌ చేస్తున్నారు..! - Sakshi

బోర్డు రూమ్‌లలోనూ మహిళల సత్తా..
ప్రతి లిస్టెడ్‌ కంపెనీలో కనీసం ఓ మహిళా డైరెక్టర్‌
సెబీ ఆదేశాలతో కంపెనీలో ప్రతిభావంతులకు చోటు
ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా, సీఈఓలుగా రాణింపు
నిఫ్టీ–50లో సెబీ ఆదేశాలను పాటించనివి ఐదు సంస్థలే


(సాక్షి, బిజినెస్‌ విభాగం)
ఆకాశంలో సగం.
సాక్షాత్తూ శివుడిలోనూ సగం.
అన్నింటా సగమే!!!
మరి బోర్డ్‌ రూమ్‌లో..? అంటే కంపెనీల డైరెక్టర్ల బోర్డులో..!
సగం ఉన్నారా? పోనీ పావు..? అర్ధ పావు..?


ఇవన్నీ కాదు కానీ... కనీసం ఒక మహిళా డైరెక్టరయినా తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే!! లేకపోతే జరిమానాలు తప్పవు! అంటూ మూడేళ్ల కిందట స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. 2014 అక్టోబర్‌ దాకా గడువిచ్చింది. లాభం లేకపోవటంతో మరో ఆరునెలలు పెంచింది. అయినా కొన్ని కంపెనీలు పాటించలేదు. రూ.50వేల జరిమానాతో 2015 జూన్‌ వరకూ గడువుపెట్టింది. అప్పటికీ పట్టించుకోని వారు... రూ.50వేలతో పాటు మహిళా డైరెక్టర్‌ను నియమించేదాకా రోజుకు రూ.1,000 చొప్పున కట్టాల్సిందేనంది. ఇక 2015 జూలై 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరులోపు గనక మహిళా డైరెక్టర్లను నియమించకుంటే... రూ.1.42 లక్షల జరిమానాతో పాటు జూలై 1 నుంచి రోజుకు రూ.5వేల చొప్పున కూడా చెల్లించాలంది.

అప్పటికీ నియమించకుంటే..?
వారిపై తగు చర్యలు తీసుకుంటామని సెబీ స్పష్టంగా చెప్పింది. ఆ చర్యలేంటో మాత్రం చెప్పలేదు లెండి!!
ఇంతకీ జరిగిందేంటంటే... చాలా కంపెనీలు సెబీ ఆదేశాల్ని పాటించాయి. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను నియమించాయి. కొన్నయితే ప్రమోటర్ల కుటుంబీకుల్నే డైరెక్టర్లుగా బోర్డులోకి తెచ్చేశాయి.

దురదృష్టమేంటంటే... ఇన్ని ఆదేశాలిచ్చిన సెబీ బోర్డులో ఇప్పటికీ ఒక మహిళా డైరెక్టర్‌ కూడా లేరు. ఇన్ని చేసినా ఇప్పటికీ మహిళా డైరెక్టర్‌ను నియమించని కంపెనీల్ని చూస్తే అందులో కేంద్రానికి చెందినవే ఎక్కువున్నాయి. అదీ... మన బోర్డ్‌రూమ్‌ల కథ. చిన్నా చితకా కంపెనీలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా... ఎన్‌ఎస్‌ఈలో టాప్‌–50గా పరిగణించే ‘నిఫ్టీ’ కంపెనీల్లో ఈ నియమాన్ని ఎంతవరకు పాటించారనేది ‘సాక్షి’ పరిగణనలోకి తీసుకుంది. ఆయా వివరాల సమాహారమే ఈ ఉమెన్స్‌డే ప్రత్యేక కథనం...

తప్పనిసరి తంతు... కొన్నింటికే!!
మహిళా డైరెక్టర్లను తప్పనిసరిగా పెట్టాలి కనక... ఆ నిబంధనల్ని పూర్తి చేయటానికి తమ కుటుంబంలోనే ఎవరో ఒకరిని బోర్డులోకి తీసుకున్న గ్రూపులు, సంస్థలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే హెచ్‌సీఎల్, రిలయన్స్‌ వంటి సంస్థలు తమ కుటుంబీకుల్ని బోర్డులోకి తీసుకున్నా... వారు కూడా ఆయా రంగాల్లో నిపుణులు, విద్యాధికులు కావటం, మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన వారు కావటం గమనార్హం. ఇక మిగిలిన కంపెనీలు చూస్తే... అత్యధికం విద్యాధికుల్ని, ప్రొఫెషనల్స్‌ను, సంస్థను సమర్థంగా నడిపించగలిగే వారినే తీసుకున్నాయి. పలువురు మహిళలు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్నా... బోర్డు నిర్ణయాల్లో తప్పొప్పులు ఎంచగల సమర్థులే.

నిపుణులు ఏలుతున్నారు..!

మహిళలు డైరెక్టర్లుగా ఉండటమే కాక... వారే అన్నీ అయి నడిపిస్తున్న కంపెనీలూ నిఫ్టీలో చాలానే ఉన్నాయి. ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ చీఫ్‌గా చందా కొచర్, యాక్సిస్‌ అధిపతిగా శిఖా శర్మ... వీళ్లంతా ఆయా సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్న వారే. యాక్సిస్‌ను విజయవంతంగా నడిపించిన శిఖాశర్మ... ఏకంగా హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో పాఠ్యాంశమయ్యారు కూడా. సిప్లాలో డైరెక్టర్‌గా ఉన్న నైనాలాల్‌ కిద్వాయ్‌... భారత్‌లో విదేశీ బ్యాంకుకు (హెచ్‌ఎస్‌బీసీ) నేతృత్వం వహించిన తొలి మహిళగానే కాక... ఫిక్కీ అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ప్రస్తుతం మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డైరెక్టరుగా ఉన్న శ్యామల గోపీనాథ్‌... దానికి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు.

ఈమె గతంలో ఆర్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌గానూ పనిచేశారు. ఇన్ఫోసిస్‌ బోర్డులో ఉన్న కిరణ్‌ మజుందార్‌ షా... బయోకాన్‌ చైర్‌పర్సన్, ఎండీ కూడా. ఐటీసీ బోర్డులో ఉన్న నిరుపమారావు... ఇండియన్‌ ఫారీన్‌ సర్వీస్‌ మాజీ ఉద్యోగిని. విదేశాంగ శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. ఐటీసీతోపాటు ఆమె కేఈసీ ఇంటర్నేషనల్, నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీల బోర్డుల్లోనూ ఉన్నారు. ఐటీసీలో మరో మహిళా డైరెక్టరుగా ఉన్న మీరా శంకర్‌.. గతంలో విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. మహీంద్రా లైఫ్‌స్పేస్‌ సీఈఓగా ఉన్న అనితా దాస్‌... ఎం అండ్‌ ఎం డైరెక్టర్‌.

ప్రమోటర్లూ రాణిస్తున్నారు...
లుపిన్‌ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న వినితా గుప్తా... దాని ప్రమోటరు కూడా. ఇక బిర్లా గ్రూపు సంస్థల్లో డైరెక్టరుగా ఉన్న రాజశ్రీ బిర్లా... పద్మ విభూషణ్‌ అందుకున్నారు. రిలయన్స్‌ బోర్డులోని నీతా అంబానీ... రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు కూడా. హెచ్‌సీఎల్‌ బోర్డులో ఉన్న రోష్ని నాడార్‌...  హెచ్‌సీఎల్‌  సీఈఓ, ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్‌ బోర్డులో ఉన్న మల్లికా శ్రీనివాసన్‌...  ప్రపంచంలో మూడో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫే (ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌)కు చైర్‌పర్సన్, సీఈవో కూడా.

చోటివ్వనివి ప్రభుత్వ కంపెనీలే!
నిఫ్టీ–50 కంపెనీల్లో ఐదింట్లోనే ఇప్పటికీ మహిళలకు చోటు దక్కలేదు. వీటిలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలే కావటం గమనార్హం. ప్రభుత్వ రంగ భెల్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ప్రయివేటు బ్యాంకింగ్‌ సంస్థలు యస్‌ బ్యాంక్, బాష్‌ మాత్రం ఇంకా తమ బోర్డులో మహిళలకు చోటివ్వలేదు. అన్నిటికన్నా చిత్రమేం టంటే... ఈ నియమం తెచ్చిన స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డులో ఇప్పటిదాకా మహిళలకు స్థానం దక్కలేదు.

కంపెనీ బోర్డుల్లో మహిళలు 2 శాతమే
ప్రపంచంలో ఎక్కడా స్త్రీ, పురుష సమానత్వం రాలేదు. భారత్‌లో ఇంకొన్ని దశాబ్దాలు పడుతుంది. సాంస్కృతికంగా మనుషుల ఆలోచనా ధోరణి మారాలి. పని ప్రదేశాల్లో మహిళలూ సమానమేననే భావన రావాలి. మహిళల్లో కూడా మార్పు కావాలి. ఆర్థిక వ్యవస్థలో తామూ భాగమేనన్న బాధ్యతను స్త్రీలు తీసుకోవాలి. విధాన నిర్ణేతల్లో మహిళలు లేరు. డెసిషన్‌ మేకర్‌గా ఎదిగినప్పుడే ఆడవాళ్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. వాళ్లు కంపెనీలో కీలక స్థానంలో ఉంటేనే కదా... స్త్రీ, పురుష సమానత్వానికి కృషి చేసేది? ఎక్కువ మంది ఆడవాళ్లను నియమించుకోవచ్చు కూడా. దేశవ్యాప్తంగా కంపెనీల్లో బోర్డు స్థాయిలో మహిళలు 2 శాతం లోపే. వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారిలో స్త్రీలు 16 శాతమే. పెళ్లయ్యాక కుటుంబ సభ్యుల సహకారం ఉండటం లేదు. 5–10 ఏళ్లకే ఉద్యోగాలు మానేస్తున్నారు. అందుకే సీనియర్‌ లెవెల్‌కి ఎదగడం లేదు. మా కంపెనీలో 40 శాతం మంది మహిళలున్నారు. పలు దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టే అక్కడ సమానత్వం ఉంది. మహిళా దినోత్సవాలకే కాకుండా ఏడాది పొడవునా స్త్రీల అభ్యున్నతి గురించి చర్చ జరగాలి.
– వనిత దాట్ల  వైస్‌ చైర్‌పర్సన్, ఎలికో. డిప్యూటీ చైర్‌వుమన్, ఇండియన్‌ వుమెన్‌ నెట్‌వర్క్, సీఐఐ సౌత్‌.

ప్రాజెక్టులు సాధించడంలో తీసిపోరు
స్త్రీ, పురుషులు సమానమనే భావన ఇప్పుడిప్పుడే పెరిగింది. సాధించాల్సిందింకా ఉంది. స్త్రీ, పురుషులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు. చాలా విషయాల్లో ఆడవాళ్లు తమ సత్తా చాటారు. కంపెనీల ఏర్పాటు, బ్యాంకుల నుంచి రుణం పొందడం, ప్రాజెక్టులు సాధించడంలో ఎవరికీ తీసిపోవడం లేదు. మహిళలు ఏదైనా సాధిస్తారు. కావాల్సిందల్లా ధైర్యమే. లింగ వివక్ష ప్రతిచోటా ఉంది. కొన్ని సందర్భాల్లో ‘నో’ అని చెప్పాలనుకున్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. విషయం ఏదైనా సూటిగా చెప్పాల్సిందే. కెరీర్‌ పరంగా ఫ్యామిలీ సహకారం అడగాలి. నేను బాధ్యతలు తీసుకోకముందు మా కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10 శాతం లోపే. ఇప్పుడు 30 శాతం పైగా ఉన్నారు. వీ6 న్యూస్‌ చానెల్‌లో 90 శాతం మహిళలే. కుటుంబ సభ్యుల సహకారం ఉంది కనకే ఇప్పుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బాధ్యతలూ స్వీకరించా.
– జి.సరోజ వివేకానంద్, ఎండీ, విశాక ఇండస్ట్రీస్‌.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement