ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్‌ సంచలనం

SBI Massive Data Leak - Sakshi

సోషల్‌ మీడియా అకౌంట్ల డేటా లీక్‌ వార్తలు వినియోగదారులకు షాకిస్తోంటే...తాజాగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌  బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతా దారుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. ఎస్‌బీఐకు చెందిన లక్షలాది ఖాతాదారుల డాటా భద్రతకు సంబంధించి టెక్‌ క్రంచ్‌ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని, ఇప్పటికే లక్షలాది కస్టమర్ల ఫోన్‌ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, తదితర వివరాలు లీకయ్యాయని ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ కస్టమర్లలో కలకలం రేగింది.

మిస్‌డ్‌ కాల్‌ ద్వారా బ్యాంకింగ్‌ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే 'ఎస్‌బీఐ క్విక్‌'. ముంబైలోని సర్వర్ డేటా సెంటర్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, తద్వారా హ్యాకర్లు  ఎవరైనా చాలా సులువుగా లక్షలాదిమంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్‌ క్రంచ్‌ పేర్కొంది.  దీంతో దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ కున్న సుమారు 42 కోట్లకు పైగా ఖాతాలకు సంబంధించిన డేటా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించని కస్టమర్లు ఎస్‌బీఐ క్విక్ ద్వారా కస్టమర్లు టెక్స్ట్‌ మెసేజ్‌లతో వివరాలను తెలుసుకునే సదుపాయం. ఎస్‌బీఐ సూచించిన కీవర్డ్స్ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, గృహ, వాహనరుణాలకు సంబంధించిన సమాచారం పొందొచ్చు. ఇలా ఎస్‌బీఐ క్విక్‌కు రోజూ మెసేజ్‌లు బట్వాడా అవుతాయనీ, అయితే పాస్‌వర్డ్ లేని డేటాబేస్‌కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసు​కోవచ్చని  చెబుతోంది. పేరు చెప్పడానికి  సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఒక్క సోమవారం రోజే ఇలాంటి  దాదాపు 30లక్షల నకిలీ మెసేజ్‌లు ఎస్‌బీఐ కస్టమర్లకు అందాయని టెక్‌ క్రంచ్‌ ఆరోపించింది. గత రెండు నెలల కాలంలో హ్యాకర్లు కస్టమర్లకు భారీ నష్టాన్ని కలిగించి వుండవచ్చని అంచనా వేసింది. 

ఎస్‌బీఐ వివరణ
అయితే దీనిపై ఎస్‌బీఐ ట్విటర్‌ ద్వారా స్పందించింది. అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్‌బీఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. అలాగే డాటాలీక్‌పై  మీడియాలో  వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని  తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది.  విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top