
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులను జారీచేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన ‘గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్–2017’జాబితాలో రెండో స్థానంలో జర్మనీ నిలవగా భారత్ 75వ ర్యాంకును పొందింది. గత ఏడాది 78వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి మూడుస్థానాలు మెరుగుపరు చుకుంది. భారతీయులకు 51 దేశాల్లో వీసా మినహాయింపు, లేదా వీసా ఆన్ అరైవల్ (విదేశీ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే వీసా మంజూరు చేస్తారు) సౌకర్యం ఉంది. అఫ్గానిస్తాన్ చివరిదైన 94వ స్థానానికి పరిమితమవగా, పాకిస్తాన్, ఇరాక్‌లు సంయుక్తంగా 93వ స్థానంలో నిలిచాయి. మెరుగైన ర్యాంకులు పొందిన దేశాల్లో చాలా వరకు ఐరోపా ఖండంలోనే ఉండటం గమనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
టాప్–10 శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు
1. సింగపూర్ 159 స్కోరు
2. జర్మనీ 158
3. స్వీడన్, దక్షిణ కొరియా 157
4. డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్,
నార్వే, జపాన్, యూకే 156
5. లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్,
బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్ 155
6. మలేసియా, ఐర్లాండ్, కెనడా, అమెరికా 154
7. ఆస్ట్రేలియా, గ్రీస్, న్యూజిలాండ్ 153
8. మాల్టా, చెక్ రిపబ్లిక్, ఐస్‌లాండ్ 152
9. హంగెరీ 150
10. స్లోవేనియా, స్లోవేకియా,
పోలండ్, లిథువేనియా, లాత్వియా 149
ట్రంప్ వచ్చాక అమెరికా ర్యాంక్ డౌన్
ఈ ఏడాది ఆరంభంలో డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా పాస్‌పోర్ట్ విలువ పడిపోతూ వస్తోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో... పలు వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ తిరగదోడటం, అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతో అగ్రరాజ్య ప్రాభవం అంతర్జాతీయంగా తగ్గుతోంది. ఇటీవలే టర్కీ, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాలు అమెరికా పౌరులకు వీసా మినహాయింపును రద్దు చేశాయి. దాంతో అమెరికా తాజా ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానానికి పడిపోయింది.
ర్యాంకు ఎలా నిర్ణయిస్తారు..
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం ఒక దేశ పౌరులు మరో దేశానికి వెళ్లినప్పుడు వీసా అవసరం లేకుండా మినహాయింపు ఉంటుంది. ఏ దేశ పౌరులకైతే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. సింగపూర్ దేశస్తులు వీసా అవసరం లేకుండా ఏకంగా 159 దేశాలకు వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రథమ స్థానం దక్కింది. ఇదివరకు జర్మనీతో కలిసి సింగపూర్ తొలి స్థానాన్ని పంచుకునేది. అయితే ఇటీవల సింగపూర్ ప్రజలకు పరాగ్వే వీసా మినహాయింపునిచ్చింది. దాంతో జర్మనీని రెండోస్థానానికి నెట్టిన సింగపూర్ తొలి స్థానానికి ఎగబాకింది. ఆసియా నుంచి దక్షిణకొరియా, జపాన్, మలేసియాలు కూడా మొదటి పది దేశాల్లో చోటు దక్కించుకున్నాయి.