రెరా.. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి!

Rera registration is mandatory! - Sakshi

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులక్కూడా

వీటికి గడువు తేదీ నవంబర్‌ 30

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడం, కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడం, స్థిరాస్తి లావాదేవీల్లో నిబంధనల అమలును ప్రోత్సహించడం, సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కృషి చేయడం, బిల్డర్లు/డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను సత్వరంగా పరిష్కరించడం కోసం రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) అథారిటీ (రెరా) పని చేయనుంది. 500 చదరపు మీటర్లకు పైబడిన లేదా 8 అపార్ట్‌మెంట్లకు మించిన  గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను బిల్డర్లు/ డెవలపర్లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఒక ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌కు రూ.750 చొప్పున వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉండనుంది.

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు సైతం రూ.500 చెల్లించి తప్పనిసరిగా నమోదు కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయని పక్షంలో బిల్డర్లు, ఏజెంట్లపై రెరా అథారిటీ జరిమానాలు విధించనుంది. దరఖాస్తుకు 30 రోజుల్లోపు రెరా అథారిటీ రిజిస్ట్రేషన్‌ జరుపుతుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 840, జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,985, డీటీసీపీ పరిధిలో 1,122 ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. మూడు నెలల ప్రత్యేక గడువుతో నవంబర్‌ 30లోగా ఈ ప్రాజెక్టులను రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పురపాలక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రాజెక్టు ఒరిజినల్‌ శాంక్షన్‌ ప్లాన్, నిర్మాణ కాల వ్యవధిని తెలపాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వివరాలను బిల్డర్లు రెరా వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.   

గ్రూపు హౌజింగ్‌ ప్రాజెక్టులకైతే ప్రతి చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున 1000 చదరపు మీటర్ల ప్రాజెక్టులకు, ప్రతి చదరపు మీటర్‌కు రూ.10 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టలకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు మొత్తం రూ.5 లక్షలకు మించకుండా  చెల్లించాల్సి ఉంటుంది.
గృహ, వాణిజ్య మిశ్రమ సముదాయాలు కలిగిన ప్రాజెక్టుల విషయంలో  ప్రతి చదరపు మీటర్‌కు మొత్తం రూ.5 చొప్పున 1000 చదరపు మీటర్ల ప్రాజెక్టులకు, ప్రతి చదరపు మీటర్‌కు రూ.10 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టలకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు  మొత్తం రూ.7 లక్షలకు మించకుండా చెల్లించాల్సి ఉంటుంది.
వాణిజ్య ప్రాజెక్టులకైతే చదరపు మీటర్‌కు రూ.20 చొప్పున 1000 చదరపు మీటర్ల వరకు, చదరపు మీటర్‌కు రూ.25 చొప్పున 1000 చదరపు మీటర్లకు పైబడిన ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు మొత్తం  రూ.10లక్షలకు మించకుండా చెల్లించాల్సి ఉంటుంది.
ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రతి చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున రూ.2లక్షలకు మించకుండా రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సి ఉండనుంది.  
ప్రాజెక్టుల కొనుగోలుదారులు రూ.1000 చెల్లించి రేరా వెబ్‌సైట్‌కు తమ ఫిర్యాదులు నమోదు చేస్తే ఆథారిటీ పరిశీలించి పరి ష్కరిస్తుంది. రెరా ఆథారిటీ నిర్ణయం పట్ల సంతృప్తి చెందని పక్షం లో రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను సంప్రతించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top