మన్మోహన్‌కు అనుకూలంగా రిపోర్టు: కేంద్రం ఏం చేసిందంటే..

Report Showing Higher GDP Growth During UPA Rule Moved To Another Website - Sakshi

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, బీజేపీ శ్రేణులకు పెద్ద షాకిస్తూ.. గత మూడు రోజుల క్రితం ఓ సంచలనాత్మక రిపోర్టు విడుదలైంది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేసిందని స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ రిపోర్టు పేర్కొంది. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని ఆ నివేదిక సారాంశం. కానీ ఆ నివేదికతో బీజేపీ గుండెల్లో ఒక్కసారిగా గుబులు పట్టుకుంది. మరోవైపు నుంచి ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే హఠాత్తుగా ఆ రిపోర్టు స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌ నుంచి మాయమైపోయింది. అంతేకాక ఆ నివేదిక కేవలం డ్రాఫ్ట్‌ రిపోర్టు మాత్రమేనని, దాని ఫైండిగ్స్‌ అధికారికమని ఎక్కడా కూడా చెప్పలేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇండియా టుడే టీవీ పరిశీలనలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది.  

స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఆ రిపోర్టు, మరో వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నట్టు తెలిసింది. రిపోర్టు కోసం ఒరిజినల్‌ లొకేషన్‌లో సెర్చ్‌ చేస్తే.. ఎలాంటి స్పందన లేదు. కానీ ఆ రిపోర్టు ప్రస్తుతం నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌(ఎన్‌ఎస్‌సీ) పేజీలో ఉందని తెలిసింది. రిపోర్టుపై సలహాలు, సూచనలు కింద దీన్ని ఎన్‌ఎస్‌సీ సెక్షన్‌లో పొందుపరిచారట. ఎన్‌ఎస్‌సీ అనేది మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో ‘అబౌట్‌ అజ్‌’ అనే సెక్షన్‌లో లిస్ట్‌ అయి ఉంటుంది. రిపోర్టును మరో ప్రాంతానికి తరలిస్తూ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మద్దతు తెలిపారు. ఆ రిపోర్టు ఇంకా ఫైనల్‌ కాదని, దానిపై ప్రభుత్వంలోనూ.. మంత్రిత్వ శాఖలోనూ ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు.

కాగ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రూపొందించిన తాజా నివేదికలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణ తర్వాత ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనేనని రిపోర్ట్ పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top