ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష

RBI sets up panel to review ownership and corporate structure at private banks - Sakshi

ప్రత్యేకంగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్‌ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సమీక్షించనుంది. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్‌ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్‌ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్‌బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్‌ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్‌ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్‌ తగిన సిఫారసులు చేయనుంది.

కోటక్‌ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్‌బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్‌ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్‌ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్‌బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్‌ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్‌ ఈ అంశంపై దృష్టి సారించనుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top