
‘హెలికాప్టర్ మనీ’ అవసరం ఉందా?!
‘హెలికాప్టర్ మనీ’ విధాన అవసరం నిగ్గుతేలాల్సి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
♦ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
♦ కేంద్ర బ్యాంకుల మధ్య చర్చకు పిలుపు
లండన్: ‘హెలికాప్టర్ మనీ’ విధాన అవసరం నిగ్గుతేలాల్సి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనిపై సెంట్రల్ బ్యాంకుల మధ్య చర్చ జరగాల్సి ఉందని పిలుపునిచ్చారు. ‘హెలికాప్టర్ మనీ’ విధానానికి సంబంధించి రాజకీయ సంబంధ అంశాలు... ఆర్థిక ప్రయోజనాలు అన్నింటిపై చర్చ జరగాలని అన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేసిన ఒక ప్రసంగం సందర్భంగా రాజన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందా? లేక సంక్షోభాలకు సమాధానం లభిస్తుందా? అన్న అంశంపై లోతైన చర్చ జరగాల్సి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ అన్నారు.
హెలికాప్టర్ మనీ అంటే...
ప్రస్తుత సంపద, నిర్దిష్టకాలంలో వృద్ధి అవకాశాలు వంటి పలు పటిష్ట అంశాల ప్రాతిపదికన తగిన స్థాయిలో కరెన్సీ ముద్రణ జరుగుతుంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా... సెంట్రల్ బ్యాంకులు భారీగా ద్రవ్య ముద్రణ చేసి... దానిని వ్యవస్థలోకి వెదజల్లడమే‘హెలికాప్టర్ మనీ’ విధానంగా పేర్కొంటున్నారు. 2008 ఆర్థికమాంద్యం నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ భారీగా నిధులను ముద్రించి దానిని వ్యవస్థలోకి పంపింది. తక్కువ వడ్డీరేట్లతో మార్కెట్లలోకి భారీ నిధులు కుమ్మరించడం ద్వారా పలు రంగాల్లో తాజా పెట్టుబడులు జరిగేలా చూడటం, దీంతో ఉపాధి అవకాశాలు పెంపొందించడం... ‘హెలికాప్టర్ మనీ’ విధానం ఉద్దేశం.
అయితే దీనివల్ల పలు దేశాల్లో కరెన్సీ విలువలు భారీగా పడిపోవడం, ద్రవ్యోల్బణం వంటి పలు ఆర్థిక సవాళ్లు ఏర్పడ్డాయి. ఇలా ముద్రించిన డబ్బును తిరిగి వ్యవస్థలోంచి వెనక్కు తీసుకుంటే తలెత్తే పరిణామాలు సానుకూలంగా ఉంటాయా? లేక ప్రతికూలంగా ఉంటాయా? అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఈ ‘హెలికాప్టర్ మనీ’ విధానాన్ని 1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రెడ్‌మన్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. 2002లో మరో అమెరికా ఆర్థికవేత్త, ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాకీ దీనిని ప్రస్తావించడంతో ఈ పదం తిరిగి వెలుగులోకి వచ్చింది. 2006లో ఆయన అమెరికా ఫెడరల్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని ఆయన అమల్లోకి సైతం తీసుకువచ్చారు.
‘ట్రాఫిక్ సిగ్నల్’ వ్యవస్థ!
ఒక దేశం ద్రవ్య విధానం... ఇతర దేశాల ద్రవ్య విధానాలపై ప్రతికూల ప్రభావం పడకుండా సెంట్రల్ బ్యాంకులకు సంబంధించి ఒక ‘ట్రాఫిక్ సిగ్నల్’ తరహా వ్యవస్థ ఉండాలని రాజన్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు.