పీఎన్‌బీ నష్టాలు 940 కోట్లు

Punjab National Bank reports Rs 940 crore loss in Q1 - Sakshi

స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు  

రూ.15,072 కోట్లకు మొత్తం ఆదాయం

8 శాతం క్షీణించిన పీఎన్‌బీ షేర్‌  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)  ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి(2018–19, క్యూ1) రూ.940 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.343 కోట్ల నికర లాభం వచ్చిందని  బ్యాంక్‌ తెలిపింది. అయితే విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ నష్టాలను క్యూ1లో బ్యాంక్‌ ప్రకటించింది. పీఎన్‌బీ రూ.2,000 కోట్ల మేర నికర నష్టాలు ప్రకటించగలదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.

మొండి బకాయిలు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం పెరగడంతో ఈ బ్యాంక్‌ నికర నష్టాలు తగ్గాయి. అయితే రూ.8,445 కోట్ల మొండి బకాయిలు రికవరీ అయినప్పటికీ, అధిక కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని పీఎన్‌బీ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) సునీల్‌ మెహతా తెలిపారు. నీరవ్‌ మోదీ స్కామ్‌ ప్రభావంతో అంతకు ముందు త్రైమాసికం (గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో రూ.13,417 కోట్ల భారీ నష్టాలు వచ్చాయని వివరించారు.  

22 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం
గత క్యూ1లో రూ.14,468 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.15,072 కోట్లకు పెరిగిందని మెహతా తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.3,855 కోట్ల నుంచి  22 శాతం వృద్ధితో రూ.4,692 కోట్లకు పెరిగిందని, సీక్వెన్షియల్‌గా చూస్తే 53 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ఇతర ఆదాయం 16 శాతం క్షీణించి రూ.1,959 కోట్లకు తగ్గిందని, అయితే మార్చి క్వార్టర్‌ ఇతర ఆదాయంతో పోల్చితే 26 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.

నిర్వహణ లాభం రూ.3,217 కోట్ల నుంచి రూ.4,195 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రుణాలు 4 శాతం వృద్ధితో రూ.4.15 లక్షల కోట్లకు, డిపాజిట్లు స్వల్ప వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా రూ.8,600 కోట్ల నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల మేర రికవరీలు సాధిస్తామన్న ఆశాభావాన్ని మెహతా వ్యక్తం చేశారు.

స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు...
సీక్వెన్షియల్‌గా చూస్తే మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయని మెహతా తెలిపారు. మార్చి క్వార్టర్‌లో 18.38 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు జూన్‌ క్వార్టర్‌లో 18.26 శాతానికి తగ్గాయని, అయితే గత క్యూ1లో ఇవి 13.66 శాతంగానే ఉన్నాయని వివరించారు. మార్చి క్వార్టర్‌లో 11.24 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు జూన్‌ క్వార్టర్‌లో 10.58 శాతానికి తగ్గాయని, గత క్యూ1లో ఇవి 8.7 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేటాయింపులు సీక్వెన్షియల్‌గా 72 శాతం తగ్గి రూ.5,758 కోట్లకు చేరాయని, అయితే గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కేటాయింపులు రూ.2,609 కోట్లుగా ఉన్నాయని తెలిపారు.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తికాగలదన్న ఆశాభావాన్ని మెహతా వ్యక్తం చేశారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్‌ బ్యాంకర్లను కూడా నియమించామని వివరించారు. అలాగే బీమా విభాగం పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను వచ్చే ఏడాది మార్చి కల్లా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. అంచనాల కంటే భారీగానే నష్టాలు తగ్గినప్పటికీ, బీఎస్‌ఈలో ఈ షేర్‌ భారీగా నష్టపోయింది. 8% పతనమై రూ.82.85 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top