గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

PSU Garden Reach Shipbuilders gets Sebi's go ahead for IPO - Sakshi

ఐపీఓ సైజు రూ.1,000–1,200 కోట్లు!

న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ కంపెనీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. యుద్ధ నౌకలు తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా 17.5 శాతానికి సమానమైన 20.04 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సైజు రూ.1,000–1,200 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

ఈ ఐపీఓకు ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) సంస్థలు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. గార్డెన్‌ రీచ్‌ కంపెనీ 1934లో ఆరంభమైంది. 1960లో ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసింది. ఇది నౌకా దళం, తీర ప్రాంత గస్తీ దళాలకు అవసరమైన యుద్ధ నౌకలను తయారు చేస్తోంది. నౌకలకు సంబంధించిన యంత్ర పరికరాలు, ప్రి–ఫ్యాబ్రికేటెడ్‌ పోర్టబుల్‌ స్టీల్‌ బ్రిడ్జ్‌లు,  మెరైన్‌ పంపులను కూడా తయారు చేస్తోంది.

ఇప్పటిదాకా 750కు పైగా నౌకలను నిర్మించింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లకి‡్ష్యంచిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఐపీఓకు వస్తున్నాయి. ఇటీవలే రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు– ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, రీట్స్‌ కంపెనీల ఐపీఓలను ఫిబ్రవరిలోనే సెబీ ఆమోదించింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా మూడు ప్రభుత్వ రంగ సంస్థలు – హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ ఐపీఓకు వచ్చాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top