రెరా నమోదిత ప్రాజెక్ట్స్‌లో  నో ఫైర్‌ సేఫ్టీ

Project does not comply with the building structure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ నిబంధనలు పాటించని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో నమోదవుతున్నాయా? రెరాలో రిజిస్టర్‌ అయిన ప్రాజెక్ట్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌–రెరా)లో ఇప్పటివరకు నమోదు చేసుకున్న అపార్ట్‌మెంట్లలో చాలా వాటిల్లో ఫైర్‌ సేఫ్టీ గానీ ఇంధన, పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదు. భవన నిర్మాణ నిబంధన ప్రకారం.. 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ), 15 మీటర్ల కంటే తక్కువ ఉంటే జీహెచ్‌ఎంసీ నుంచి ఎన్‌వోసీ ఉండాలి. కానీ, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు చేపడుతున్న హైరైజ్‌ భవనాలు మినహా చాలా ప్రాజెక్ట్‌లు ఎలాంటి ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పాటించలేదు. అయినా సరే రెరా అధికారులు ప్రాజెక్ట్‌లను రిజిస్టర్‌లో చేయడం, గుర్తింపు పత్రం, సంఖ్య కూడా కేటాయించారు. ఈ రోజుల్లో నివాస భవనాల నిర్మాణంలో ఫాల్స్‌ సీలింగ్, ఫోమ్‌ సీలింగ్, అదనపు లైట్ల ఏర్పాట్లు, పైప్‌డ్‌ గ్యాస్‌ కనెక్షన్స్‌ వంటి ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. వీటికి వేడిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందుకే ఫైర్‌ ఎన్‌వోసీ ఉంటేనే రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదాలను ఊహించలేమని రెసిడెన్స్‌ అసోసియేషన్‌ హెచ్చరిస్తుంది. 

ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా.. 
రెరాలో నమోదైన చాలా ప్రాజెక్ట్‌లు ఫైర్‌ సేఫ్టీ మాత్రమే కాదండోయ్‌ ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా గాలికొదిలేశాయి. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ), రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లేవీ లేని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో రిజిస్టరయ్యాయి. 300 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే భవనాల్లో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ ఏర్పాట్లు ఉండాల్సిందే. కానీ, నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటూ శివారుల్లోని అర్హత ఉన్న భవనాల్లోనూ నిబంధనలు పాటించలేదు. ‘‘కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదైన విషయం వాస్తవమే. సంబంధిత ప్రాజెక్ట్‌ నిర్మా ణం పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని’’ రెరా అధికారులు తెలపడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top