టెల్కోల వీరబాదుడు..! | Private telecom players hike prepaid tariff by up to 50 persant | Sakshi
Sakshi News home page

టెల్కోల వీరబాదుడు..!

Dec 2 2019 5:45 AM | Updated on Dec 2 2019 6:33 PM

Private telecom players hike prepaid tariff by up to 50 persant - Sakshi

న్యూఢిల్లీ: చౌక మొబైల్‌ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్‌ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్‌–ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ కొత్త రేట్లు డిసెంబర్‌ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్‌ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్‌ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  



‘టీ ఖర్చుకన్నా తక్కువే’..!
వొడాఫోన్‌–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్‌ ప్రవేశపెట్టింది. మార్కెట్‌ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్‌ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్‌ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్‌ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్‌లిమిటెడ్‌ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్‌–ఇన్‌–వన్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్‌ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది.  

అపరిమితంలో.. పరిమితులు...
అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్‌ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు,  ఎయిర్‌టెల్‌ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్‌ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement