breaking news
Pre-paid customers
-
టెల్కోల వీరబాదుడు..!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్టెల్ కొత్త రేట్లు డిసెంబర్ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ‘టీ ఖర్చుకన్నా తక్కువే’..! వొడాఫోన్–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. మార్కెట్ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్–ఇన్–వన్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. అపరిమితంలో.. పరిమితులు... అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్టెల్ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి. -
ఐడియా ప్రి-పెయిడ్ యూజర్లందరికీ సెకన్ ప్లాను
న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ తాజాగా తమ ప్రి-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాను పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రి-పెయిడ్ యూజర్లు పర్ సెకను బిల్లింగ్నే ఉపయోగిస్తున్నట్లు.. పర్ మినిట్ బిల్లింగ్ ప్లాన్‌లో ఉన్న కోటిన్నర మంది యూజర్లను కూడా వచ్చే 30 రోజుల్లో పర్ సెకన్ ప్లాన్‌కు మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం 16.6 కోట్ల మంది యూజర్లలో 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ వివరించింది. ఇప్పటిదాకా పర్ మినిట్, పర్ సెకన్ ప్లాన్లు రెండింటినీ అందిస్తూ వచ్చామని .. ఇకపై మొత్తం 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ యూజర్లకు పూర్తిగా పర్ సెకన్ ప్లాన్ అమలవుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కాల్ డ్రాప్ సమస్య వివాదాస్పదమైన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా ప్రి-పెయిడ్ యూజర్లకు పర్ సెకను ప్లాన్ అందించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ ఇటీవలే ఇటువంటి ఆఫర్ ప్రకటించింది. పర్ మినిట్ ప్లాన్‌లో ఉన్న యూజర్లు .. కాల్ మధ్యలోనే అంతరాయం ఏర్పడినప్పటికీ పూర్తిగా నిమిషానికి చార్జీ కట్టాల్సి వచ్చేది. తాజాగా సెకను ప్లాన్‌లో ఎన్ని సెకన్లు మాట్లాడితే అంతే సమయానికి మాత్రమే కట్టే వెసులుబాటు ఉంటుంది. -
వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రిచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. సర్కిల్లో వొడాఫోన్‌కు 65 లక్షల మంది వినియోగదార్లుంటే, 20 లక్షల మందికిపైగా డేటా వాడుతున్నారు.