Sakshi News home page

ఐడియా ప్రి-పెయిడ్ యూజర్లందరికీ సెకన్ ప్లాను

Published Fri, Sep 25 2015 12:02 AM

ఐడియా ప్రి-పెయిడ్ యూజర్లందరికీ సెకన్ ప్లాను

న్యూఢిల్లీ: టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ తాజాగా తమ ప్రి-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాను పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది ప్రి-పెయిడ్ యూజర్లు పర్ సెకను బిల్లింగ్‌నే ఉపయోగిస్తున్నట్లు.. పర్ మినిట్ బిల్లింగ్ ప్లాన్‌లో ఉన్న కోటిన్నర మంది యూజర్లను కూడా వచ్చే 30 రోజుల్లో పర్ సెకన్ ప్లాన్‌కు మారుస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం 16.6 కోట్ల మంది యూజర్లలో 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్నట్లు ఐడియా సెల్యులార్ వివరించింది.

ఇప్పటిదాకా పర్ మినిట్, పర్ సెకన్ ప్లాన్లు రెండింటినీ అందిస్తూ వచ్చామని .. ఇకపై మొత్తం 15.7 కోట్ల మంది ప్రి-పెయిడ్ యూజర్లకు పూర్తిగా పర్ సెకన్ ప్లాన్ అమలవుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు. ఇటీవలి కాలంలో కాల్ డ్రాప్ సమస్య వివాదాస్పదమైన నేపథ్యంలో టెలికం కంపెనీలు ఒక్కొక్కటిగా ప్రి-పెయిడ్ యూజర్లకు పర్ సెకను ప్లాన్ అందించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే ఇటువంటి ఆఫర్ ప్రకటించింది. పర్ మినిట్ ప్లాన్‌లో ఉన్న యూజర్లు .. కాల్ మధ్యలోనే అంతరాయం ఏర్పడినప్పటికీ పూర్తిగా నిమిషానికి చార్జీ కట్టాల్సి వచ్చేది. తాజాగా సెకను ప్లాన్‌లో ఎన్ని సెకన్లు మాట్లాడితే అంతే సమయానికి మాత్రమే కట్టే వెసులుబాటు ఉంటుంది.

Advertisement
Advertisement