బిగ్‌బుల్‌ను కాపాడని టైటాన్‌ షేరు! | Sakshi
Sakshi News home page

బిగ్‌బుల్‌ను కాపాడని టైటాన్‌ షేరు!

Published Tue, May 19 2020 2:36 PM

planets turn unfavorable for RJ - Sakshi

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కొన్ని నెలలుగా బేర్‌ కౌగిట్లో చిక్కుకున్నాయి. దీంతో బడా బుల్‌ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు కూడా నష్టాల్లో నడుస్తున్నాయి. చివరకు ప్రతి బేర్‌ దశలో కూడా నష్టాలనుంచి తప్పించుకునే బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో సైతం ఈ సారి నష్టాలపాలైంది. సహజంగా ప్రతిసారి షేర్లు పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరగడం, దీంతో బంగారం ధర ఆధారిత టైటాన్‌ షేరు దూసుకుపోవడంతో రాకేశ్‌ పోర్టుఫోలియోకు రక్షణ లభించడం జరిగేది. కానీ ఈ సారి ఈ సీన్‌ రివర్సయింది. ఈ సారి ఎప్పటిలాగే మార్కెట్‌ పతనం సందర్భంగా పసిడి ధర దూసుకుపోవడం జరిగింది. డిసెంబర్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ. 37000 ఉండగా, ప్రస్తుతం ఈ ధర దాదాపు 47-48వేల రూపాయలకు చేరింది. కానీ ఎప్పటిలాగా ఈ పెరుగుదల టైటాన్‌ షేర్లలో జోష్‌ ఇవ్వలేదు. ఈ షేర్లు తాజా పతనంలో దాదాపు 30 శాతం పడిపోయాయి. దీంతో పలు బ్రోకరేజ్‌లు షేరుపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. 
ఇలా బంగారం ధర పెరిగితే టైటాన్‌ షేరు ధర రివర్సులో పడిపోవడం 15 ఏళ్ల తర్వాత జరిగింది. రాకేశ్‌ పోర్టుఫోలియోలో టైటాన్‌ వాటా పెద్దది. దీని ధర పెరగకపోవడం అంతిమంగా ఆయన పోర్టుఫోలియోను కుంగదీసింది. బంగారం ధర పెరిగినా టైటాన్‌ ధర పెరగకపోవడానికి కారణం ‍ప్రధానంగా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు నిలిచిపోవడమేనని ప్రభుదాస్‌ లీలాధర్‌ సంస్థ అంచనా వేసింది. దీనికితోడు అధికమాసాలు రావడం, శ్రాద్ధమాసాలు పెరగడం, బయట మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆభరణాలకు బదులు కాయిన్స్‌, బార్లు కొని దాచుకోవడం.. తదితరాలు టైటాన్‌ను దెబ్బతీశాయని ఫిలిప్‌ క్యాపిటల్‌ విశ్లేషించింది. పైగా కంపెనీకి చెందిన ఎక్కువ స్టోర్లు మాల్స్‌లో ఉండడం, ఇవన్నీ లాక్‌డౌన్‌లో మూతపడడం కూడా ప్రభావం చూపింది. ఇక పండుగలు పబ్బాలు స్తబ్దుగా గడిచిపోవడం, పెళ్లిళ్ల వాయిదా, ఫంక్షన్లు జరగకపోవడం వంటివన్నీ ఆభరణాల అమ్మకాలపై నెగిటివ్‌ ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ కలిసి రాకేశ్‌ పోర్టుఫోలియోను దెబ్బతీశాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement