3 నెలల్లో 350 ఏటీఎంలు మూత

Over 350 ATMs shut in three months

సాక్షి,న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు సాగిస్తోంది. డిజిటల్‌ లావాదేవీలకు ప్రజలను ప్రేరేపించేందుకు క్రమంగా ఏటీఎంల సంఖ్యనూ కుదించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి.నోట్ల రద్దు అనంతరం ఏటీఎంలు మూతపడుతుండటంతో క్యాష్‌లెస్‌ దిశగా ప్రభుత్వం, బ్యాంకులు విస్పష్ట సంకేతాలు పంపుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్‌ మధ్య మూడు నెలల కాలంలో ఏకంగా 350 ఏటీఎంలు మూతపడ్డాయి. గత ఏడాది నవంబర్‌లో నోట్ల రద్దు అనంతరం ప్రజలు పేటీఎం వంటి ఇతర నగదు రహిత ఫ్లాట్‌ఫ్లాంలపైకి మళ్లడంతో ఏటీఎంల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా తక్కువ కియోస్క్‌లతో పనినడిపించాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏటీఎంల సంఖ్య తగ్గడం కేవలం 0.16 శాతమే అయినా, గత నాలుగేళ్లుగా ఏటీఎంల సంఖ్య ఏటా 16.4 శాతం పెరుగుతున్న క్రమంలో వీటి సంఖ్య తొలిసారిగా పడిపోవడం గమనార్హం.

మెట్రో నగరాల్లో ఏటీఎంల నిర్వహణ బ్యాంకులకు భారంగా మారడం కూడా వీటిని కుదించేందుకు బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఎస్‌బీఐ తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న అనంతరం పలు ఏటీఎంలను మూసివేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కూడా ఏటీఎంలను కుదించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top