కార్వీకి మరో షాక్‌..!

NSE suspends Karvy Stock Broking's licence due to non-compliance - Sakshi

ట్రేడింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేసిన ఎక్సే్ఛంజీలు

నిబంధనలు ఉల్లంఘించినందుకే

శాట్‌ను ఆశ్రయించనున్న సంస్థ

పీవోఏపై ఊరటనివ్వని సెబీ

ముంబై/హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా  అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సోమవారం ప్రకటించాయి.  ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా విడుదల చేసిన సర్క్యులర్‌లలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వివరించాయి. ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో కార్వీ ట్రేడింగ్‌ టెర్మినల్స్‌ను డీయాక్టివేట్‌ చేసినట్లు బీఎస్‌ఈ తెలిపింది. ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ సెగ్మెంట్స్‌లో నిర్దిష్ట ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.

అటు ఎన్‌ఎస్‌ఈ కూడా ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ డెరివేటివ్స్, డెట్, కమోడిటీ డెరివేటివ్స్‌ వంటి అన్ని విభాగాల్లోనూ కార్వీపై నిషేధం విధించింది. అయితే, బ్రోకింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేయడంపై సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)ను ఆశ్రయించనున్నట్లు కార్వీ వర్గాలు తెలిపాయి. ఇది సత్వరమే పరిష్కారం కాగలదని పేర్కొన్నాయి. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్‌ 22న మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది.  

వెసులుబాటుకు సెబీ నిరాకరణ..
క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలు (పీవోఏ) ఉపయోగించుకుని వారి ట్రేడ్స్‌ను సెటిల్‌ చేయడానికి వెసులుబాటు ఇవ్వాలన్న కార్వీ అభ్యర్థనను సెబీ తోసిపుచ్చింది. పీవోఏలను దుర్వినియోగం చేసి, క్లయింట్ల షేర్లను కంపెనీ అక్రమంగా దారి మళ్లించిందని ఆక్షేపించింది. ప్రాథమిక ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్ల పీవోఏలను కార్వీ ఉపయోగించడానికి అనుమతించడం వివేకవంతమైన నిర్ణయం కాబోదని సెబీ స్పష్టం చేసింది.

కార్వీ ద్వారా షేర్లను విక్రయించాలనుకుంటున్న క్లయింట్లు.. ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ లేదా ఫిజికల్‌ డెలివరీ ఇన్‌స్ట్రక్షన్‌ స్లిప్‌ (డీఐఎస్‌)ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. విక్రయించిన షేర్లను డీమ్యాట్‌ అకౌంట్‌ నుంచి డెబిట్‌ చేసేలా బ్రోకింగ్‌ సంస్థకు క్లయింట్లు సూచనలివ్వడానికి డీఐఎస్‌ ఉపయోగపడుతుంది. కార్వీపై ఎన్‌ఎస్‌ఈ చేపట్టిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఇంకా కొనసాగుతోందని, క్లయింట్ల షేర్లు.. నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగిందన్నది త్వరలోనే వెల్లడవుతుందని సెబీ వ్యాఖ్యానించింది. పీవోఏను ఉపయోగించుకోవడంపై స్పష్టతనివ్వాలన్న కార్వీ అభ్యర్థ్ధనపై డిసెంబర్‌ 2లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సెబీకి శాట్‌ సూచించిన సంగతి తెలిసిందే.  

ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్లు..
కార్వీ అక్రమంగా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న షేర్లలో సుమారు 90 శాతం సెక్యూరిటీలు.. తిరిగి క్లయింట్ల ఖాతాల్లోకి చేరాయి. సెబీ తీసుకున్న సత్వర చర్యలతో సుమారు 83,000 మంది ఇన్వెస్టర్లకు తమ షేర్లు తిరిగి వచ్చాయని నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్‌) వెల్లడించింది. ‘సెబీ ఆదేశాల మేరకు, ఎన్‌ఎస్‌ఈ పర్యవేక్షణలో కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ డీమ్యాట్‌ ఖాతా నుంచి సుమారు 82,599 మంది క్లయింట్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్లను బదలాయించడం జరిగింది‘ అని పేర్కొంది. బాకీలు సెటిల్‌ చేసిన తర్వాత మిగతా వారి ఖాతాల్లోకి కూడా షేర్ల బదలాయింపు పూర్తవుతుందని ఎన్‌ఎస్‌డీఎల్‌ వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top