బ్యాంకుల విలీనంతో ఉద్యోగాల కోత ఉండదు 

No job losses due to merger of public sector banks - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు నష్టం వాటిల్లదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఈ వారం మొదట్లో ఆమోదం తెలిపింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ మాదిరిగా పెద్ద బ్యాంకు అవతరిస్తుందని జైట్లీ చెప్పారు. రుణాలపై వ్యయాలు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వ రంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులు ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలో (పీసీఏ) ఉన్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ చెప్పారు. అధిక ఎన్‌పీఏలతో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ పీసీఏను అమల్లోకి తెచ్చింది. రూ.3 లక్షల కోట్లను వ్యవస్థలోకి తిరిగి తీసుకొచ్చేందుకు దివాలా చట్టం సాయపడినట్టు మంత్రి తెలిపారు. ఎస్‌బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహణ పరంగా లాభాల్లోనే ఉన్నప్పటికీ, మొండి బకాయిలకు కేటాయింపులు చేయడం వల్లే నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం రూ.65,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయిం చగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి రూ. 51,533 కోట్ల నిధుల సాయం చేసినట్టు తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top