ఎగవేతదారులను వదలొద్దు

Nirmala Sitharaman to attend 159th Income Tax Day event - Sakshi

నిజాయతీగా పన్నులు కట్టేవారికి తగిన గౌరవమివ్వాలి

ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆర్థిక మంత్రి

నిర్మలా సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు.  159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు.

‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్‌ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్‌ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు.  

సులభసాధ్యమైన లక్ష్యం..
2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు.  ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు.

ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి..
పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ ప్రమోద్‌ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top