మూడో రోజూ రికార్డ్‌ లాభాలు

Nifty, Sensex at record highs - Sakshi

కొనసాగుతున్న ఆల్‌టైమ్‌హైలు

ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు సూచీలు

115 పాయింట్ల లాభంతో 41,674కు సెన్సెక్స్‌

38 పాయింట్లు పెరిగి 12,260కు నిఫ్టీ  

దలాల్‌ స్ట్రీట్‌ ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లతో దద్దరిల్లుతోంది. ఇంధన, ఐటీ, వాహన షేర్ల జోరుతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట  స్థాయి, 41,719 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరకు 115 పాయింట్ల లాభంతో 41,674 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 12,268 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 38 పాయింట్ల లాభంతో 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడినా, ఎన్‌ఎస్‌ఈ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా ఒడిదుడుకులు చోటు చేసుకున్నా,  మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది.

త్వరలో యూటీఐ ఏఎమ్‌సీ ఐపీఓ
ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ, యూటీఐ ఏఎమ్‌సీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఈ ఐపీఓ సైజు రూ.3,000 కోట్లుగా ఉండగలదని అంచనా.

సెన్సెక్స్‌ @ 45,500  
వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 45,500 పాయింట్లకు, నిఫ్టీ 13,400 పాయింట్లకు  చేరతాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ఫార్మా, ఆగ్రో కెమికల్స్, ఆయిల్, గ్యాస్, కార్పొరేట్‌ బ్యాంక్‌లు, పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, మిడ్‌క్యాప్‌ సిమెంట్‌ కంపెనీలు, నిర్మాణ  రంగ షేర్లు లాభపడతాయని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top